T20 League : వారి రాకతో బెంగళూరు జట్టు మరింత బలోపేతం.!

టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు త్వరలో బరిలోకి దిగనున్నారు. ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఏప్రిల్ 9న ముంబయితో జరుగనున్న మ్యాచుకి, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో...

Published : 06 Apr 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్ : టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు త్వరలో బరిలోకి దిగనున్నారు. ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఏప్రిల్ 9న ముంబయితో జరుగనున్న మ్యాచుకి, ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జోష్ హేజిల్‌వుడ్‌ ఏప్రిల్‌ 12న చెన్నైతో జరుగనున్న మ్యాచుకు అందుబాటులోకి రానున్నారు. కీలక ఆటగాళ్ల రాకతో బెంగళూరు జట్టు మరింత బలోపేతం కానుంది.      

‘జోష్‌ హేజిల్‌వుడ్‌ మరో రెండు మూడు రోజుల్లో అందుబాటులోకి రానున్నాడు. పాకిస్థాన్ పర్యటన ముగిసిన తర్వాత అతడు కాస్త విరామం తీసుకుని.. బెంగళూరు జట్టులో చేరనున్నాడు’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. పాక్‌ పర్యటన అనంతరం హేజిల్‌వుడ్‌ నేరుగా బెంగళూరు జట్టులో చేరిపోయి ఉంటే.. క్వారంటెయిన్‌ పూర్తి చేసుకుని ఏప్రిల్ 9న ముంబయితో జరుగనున్న మ్యాచుకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది.

మ్యాక్సీ.. ఇప్పటికే వచ్చేసినా.!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చినట్లు బెంగళూరు జట్టు హెడ్‌ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ తెలిపాడు. ఏప్రిల్ 9న ముంబయితో జరుగనున్న మ్యాచులో అతడు బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. 

‘క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లెవరైనా.. ఏప్రిల్‌ 6 (ఆస్ట్రేలియా జట్టు పాక్‌ పర్యటన ముగిసే) వరకు ఇతర లీగుల్లో ఆడేందుకు అవకాశం లేదని ఇప్పటికే సీఏ స్పష్టం చేసింది. ఈ కారణంగానే మ్యాక్స్‌వెల్‌ ఇప్పటికే జట్టులో చేరి.. క్వారంటెయిన్‌ పూర్తి చేసుకున్నా మ్యాచులు ఆడటం లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే మేం ప్లాన్ చేసుకున్నాం’ అని కోచ్‌ మైక్‌ హెస్సన్‌ తెలిపాడు.

వివాహం కారణంగా మ్యాక్స్‌వెల్‌ పాక్‌ పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. అయినా సీఏ నిబంధనల ప్రకారం.. అతడు వేరే లీగుల్లో ఆడేందుకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో అతడు మంగళవారం (ఏప్రిల్ 5న) రాజస్థాన్‌ జట్టుతో జరుగనున్న మ్యాచుకు దూరం కానున్నాడు. కొత్త కెప్టెన్‌ డు ప్లెసిస్‌ సారథ్యంలో ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడిన బెంగళూరు జట్టు.. ఓ మ్యాచులో ఓడి.. మరో దాంట్లో గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని