HBD GANGULY: ‘ఫియర్‌లెస్‌’ కెప్టెన్‌.. హ్యాపీ బర్త్‌డే గంగూలీ భాయ్‌!

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పుట్టిన రోజు నేడు. తన కెప్టెన్సీతో భారత జట్టును పటిష్ఠంగా మార్చిన గంగూలీ క్రికెట్ జర్నీ ఇలా..

Published : 08 Jul 2023 13:40 IST

భారత క్రికెట్‌ గమనాన్ని మార్చిన ఘనత సౌరభ్ గంగూలీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు టీమ్‌ఇండియా ఆటతీరు కాస్త నెమ్మదిగా ఉండేది. ఇక గంగూలీ సారథిగా వచ్చిన తర్వాత దూకుడు మంత్రంతో దూసుకెళ్లింది. ప్రత్యర్థులు సై అంటే.. తాను కూడా సై సై అంటూ జట్టును ముందుండి నడిపించాడు. టాలెంటెడ్ యువకులను ప్రోత్సహించడంలోనూ వెనుకడుగు వేసేవాడు కాదు. అలాంటి గంగూలీ ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగానూ సేవలందించాడు. ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా మారిన సౌరభ్ గంగూలీ 51వ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా అతడి క్రికెట్‌ ప్రయాణంపై ఓ కన్నేద్దాం.. 

అన్నయ్య ప్రోద్బలంతోనే..

(ఫొటో సోర్స్‌: ట్విటర్‌)
 

వాస్తవానికి గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టంలేదు. అయితే, అన్నయ్య స్నేహశీష్ గంగూలీ అప్పటికే మంచి పేరున్న బెంగాల్‌ క్రికెటర్‌. అతడి ప్రోత్సాహంతోనే గంగూలీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1990-91 రంజీ సీజన్లో పరుగుల వరద పారించాడు. ఫలితంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఆడిన ఏకైక మ్యాచ్‌లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి దేశవాళీ క్రికెట్‌లో ఆడి రాణించాడు. 1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేయడంతో మరోసారి జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్‌ టెస్టులో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి గంగూలీ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో 131 పరుగులు సాధించి.. లార్డ్స్‌లో అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో కూడా శతకం బాదాడు. సచిన్‌తో కలిసి 255 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో నాటి నుంచి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.

అదొక విప్లవం..
 

సచిన్‌ తరవాత వన్డే కెప్టెన్సీ బాధ్యతలను దాదా స్వీకరించాడు. తొలి సిరీస్‌లోనే బలమైన దక్షిణాఫ్రికాను 3-2 తేడాతో టీమ్‌ఇండియా ఓడించింది. ఆ తరవాత నాట్‌వెస్ట్‌ సిరీస్ విజయం గంగూలీ కెరీర్‌లోనే గొప్ప ఘనత. శ్రీలంక, ఇంగ్లాండ్‌, టీమ్‌ఇండియా తలపడిన ఈ ముక్కోణపు సిరీస్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లార్డ్స్‌లో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనకు ఓపెనర్‌గా వచ్చిన గంగూలీ 43 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. సెహ్వాగ్‌తో కలిసి తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా మిడిలార్డర్‌ వైఫల్యంతో 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే కైఫ్‌ (87*), యువరాజ్‌ (69) ఆదుకున్నారు. యువీ జట్టు స్కోరు 267 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాక కైఫ్‌ లోయర్‌ఆర్డర్‌తో కలిసి పోరాటం చేశాడు. దీంతో భారత్‌ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం అందుకున్నాక డ్రెస్సింగ్‌ రూమ్‌ బయట నుంచి దాదా చొక్కవిప్పి గాల్లో తిప్పిన దృశ్యం అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

(ఫొటో సోర్స్‌: ట్విటర్‌)

2003 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దాదా నాయకత్వంలో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగింది. అయితే, అనూహ్య ప్రదర్శనతో మేటి జట్లను ఓడించి ఫైనల్స్‌కు చేరింది. అయితే, అక్కడ ఆస్ట్రేలియా దూకుడు ముందు నిలవలేకపోయింది. ఈ ఓటమి ప్రతి అభిమానిని కలచివేసింది. ఈ మ్యాచ్‌ తర్వాత అభిమానులు టీవీలు బద్దలు కొట్టిన ఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే, గంగూలీ మాత్రం తన జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆటగాళ్లలో ఉత్సాహం నింపాడు. 2002లో దాదా టెస్టు సారథ్య బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌లో గొప్ప విజయాలను టీమ్‌ ఇండియా సాధించింది. అప్పట్లో అత్యధిక టెస్టు విజయాలు (21) సాధించిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. 

ఛాపెల్‌ వివాదంలో..

2005లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా గ్రేగ్‌ ఛాపెల్‌ను తీసుకురావడంలో గంగూలీనే కీలక పాత్ర పోషించాడు. విదేశీ కోచ్‌ అయితే బాగుంటుందని బీసీసీఐకి నచ్చజెప్పి మరీ తీసుకొచ్చాడు. గంగూలీ బ్యాటింగ్‌లో పలు మ్యాచ్‌ల్లో విఫలమవడంతో జట్టును నడిపించే స్థితిలో అతడు లేడని ఛాపెల్‌ బీసీసీఐకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ కొద్ది నెలలు జట్టుకు దూరమయ్యాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి తనదైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఫలితంగా 2007 వన్డే ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. కానీ, టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమిపాలై గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఆపై పలువురు సీనియర్‌ ఆటగాళ్లకు ఛాపెల్‌తో పొసగకపోవడంతో కోచ్‌ బాధ్యతల నుంచి అతను తప్పుకొన్నాడు.

అలా ముగించి.. ఇలా వచ్చి..

ఛాపెల్‌ వివాదంతో టీమ్‌ఇండియా మళ్లీ గడ్డుకాలం ఎదుర్కొంటుందని క్రికెట్‌ విశ్లేషకులు భావించారు. కానీ, అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ధోనీ వంటి కొత్త లీడర్‌ యువ భారత జట్టును విజయపథంలో నడిపాడు. గంగూలీ వారసుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఈ నేపథ్యంలోనే 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌తో దాదా ఆటకు గుడ్‌బై చెప్పాడు. టీమ్‌ఇండియా తరఫున 311 వన్డేలు, 113 టెస్టులు ఆడి 18వేలకు పైగా పరుగులు సాధించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. 2015 నుంచి నాలుగేళ్లపాటు బెంగాల్ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా పనిచేశాడు. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత నుంచి దేశీయ క్రికెట్‌లో పెనుమార్పులు చోటు చేసుకొన్నాయి. గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో దిల్లీ మెంటార్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు క్రికెట్‌ విశ్లేషకుడిగానూ వ్యవహరిస్తున్నాడు.

అది 2000వ సంవత్సరం... ఒకవైపు భారత క్రికెట్‌లో ఫిక్సింగ్‌ కలకలం.. మరోవైపు కెప్టెన్సీకి సచిన్‌ రాజీనామా. దీంతో గందరగోళ పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఉంది. చర్చ మొత్తం భారత జట్టును నడిపించే నాయకుడు ఎవరనేది. నాటి వైస్‌ కెప్టెన్‌ అజయ్‌ జడేజాతో పాటు అనిల్‌ కుంబ్లే కూడా రేసులో ఉన్నారు. అయితే, వీరిని కాదని అశోక్‌ మల్హోత్రా ఆధ్వర్యంలోని సెలెక్టర్ల బృందం సంచలన నిర్ణయం తీసుకొంది. అదే భారత క్రికెట్‌లో సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీకి నాంది. టీమ్‌ ఇండియా పురోగతికి పునాది.

 - ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని