PV Sindhu: కామన్వెల్త్‌లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు

కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మంగళవారం పసిడి ముద్దాడడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ పతకం తనకెంతో ప్రత్యేకమని తెలిపింది...

Updated : 15 Aug 2022 14:36 IST

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మంగళవారం పసిడి ముద్దాడడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ పతకం తనకెంతో ప్రత్యేకమని తెలిపింది. కామన్వెల్త్‌ క్రీడల్లో వరుసగా మూడు సార్లు పతకాలు సాధించడంతో ఈ గేమ్స్‌లో అన్ని రకాల పతకాలు పూర్తి చేశానని చెప్పింది. అందుకే ఇది తనకు ప్రత్యేకమని పేర్కొంది. కాగా, సింధు 2014లో తొలిసారి కాంస్యం గెలుపొందగా 2018లో రజతం కైవసం చేసుకుంది. ఈసారి ఏకంగా తుదిపోరులోనే విజయం సాధించడంతో స్వర్ణం పొందింది. ఇక బంగారు పతకం అందుకున్న అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన సింధు ఈ వ్యాఖ్యలు చేసింది.

‘నాలుగేళ్లకోసారి వచ్చే ఈ కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం కైవసం చేసుకోవడం ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని ఎక్కడ ఉంచుతానని అడిగితే ఒలింపిక్స్‌ పతకాల నడుమ పెడతానని చెప్తాను. ఎందుకంటే భారత దేశం తరఫున ఆడటం, పతకాలు సాధించడం అంటే నాకెంతో ఇష్టం. అందుకే ఇది చాలా ప్రత్యేకం. ఈ విజయాన్ని ఎంతగానో ఆస్వాదిస్తాను’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ప్రధాని మోదీ ఆమెను ‘ఛాంపియన్లకే ఛాంపియన్‌’ అని ప్రత్యేకంగా ప్రశంసించడంపై స్పందిస్తూ.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది. మోదీ ఏం చెప్పినా దాన్ని కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తానని పేర్కొంది. ఈ పోటీల కోసం తాను బాగా కష్టపడ్డానని, తన కోచ్‌ కూడా మెరుగైన శిక్షణ ఇచ్చాడని చెప్పింది. ఈ సందర్భంగా తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకు కృషి చేసిన సహాయక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని