Ricky Ponting : టీమ్‌ఇండియా స్టార్‌ను నాలుగో స్థానంలో ఆడిస్తే ఉత్తమం: రికీ పాంటింగ్‌

మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా...

Updated : 17 Aug 2022 12:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో టీమ్‌ఇండియా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తోంది. ప్రతి ఆటగాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేలా తయారు చేస్తోంది. రెగ్యులర్‌గా విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌లో ఎవరో ఒకరితో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేవాడు. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో వారిద్దరూ గైర్హాజరు కావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ (ఎస్‌కేవై)తో రోహిత్ ఓపెనింగ్ చేయించాడు. ఆ సిరీస్‌లో సూర్యకుమార్‌ మంచి ఇన్నింగ్స్‌లతో రాణించాడు. అతడినే ఓపెనింగ్‌కు దింపాలని పలువురు మాజీలు, అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మాత్రం వారికి భిన్నంగా స్పందించాడు. ఓపెనర్‌గా కంటే సూర్యకుమార్‌ను నాలుగో స్థానంలో దింపితే  జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.

‘‘ఏ జట్టుకైనా బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్‌-4 కీలకం. విరాట్ కోహ్లీకి అతడెప్పుడూ ఆడే మూడో స్థానం (వన్‌డౌన్) కేటాయించాలి. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనింగ్‌తోపాటు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు. అయితే ఎస్‌కేవైను కొత్త బంతికి దూరంగా ఉంచడం మంచిది. పవర్‌ప్లేలో ఎవరైనా షాట్లు కొట్టగలరు. కానీ మిడిల్‌ ఓవర్లలో ఆట నియంత్రణలోకి రావాలంటే అక్కడా దూకుడుగా ఆడేవారు ఉండాలి. అందుకే సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దించితే మేలు’’ అని పాంటింగ్‌ వివరించాడు. 

టీమ్‌ఇండియా మ్యాచ్ విన్నర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌ నిలుస్తాడని పాంటింగ్‌ తెలిపాడు. అతడు సవాళ్లను స్వీకరించే విధానం తనకెంతో ఇష్టమని పేర్కొన్నాడు. ‘‘సూర్యకుమార్ గేమ్‌ను చూస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఇలాంటి ఆటగాడు కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే. ఆస్ట్రేలియా వేదికగా జరిగే మెగా టోర్నీలో అభిమానులు అతడి ఆటను ఎంజాయ్‌ చేస్తారు. సవాళ్ల నుంచి వెనక్కి వెళ్లకుండా దీటుగా పోరాడే వ్యక్తి సూర్యకుమార్‌. టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలుస్తాడు’’ అని పాంటింగ్‌ వెల్లడించాడు. ఆగస్టు 27 నుంచి టీ20 ఫార్మాట్‌లోనే ఆసియా కప్‌ జరగనుంది. ఆ తర్వాత ఆసీస్‌లో పొట్టి ప్రపంచకప్‌ అక్టోబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు