CommonWealth Games: కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు హాకీ ఇండియా దూరం!

కామన్‌వెల్త్‌ క్రీడలకు జట్లను పంపించకూడదని హాకీ ఇండియా నిర్ణయం

Updated : 15 Aug 2022 14:17 IST

దిల్లీ: కామన్‌వెల్త్‌-2022 క్రీడలకు పురుషులు, మహిళల జట్లను పంపించకూడదని హాకీ ఇండియా నిర్ణయించింది. బ్రిటన్‌లో కరోనా ఉద్ధృతి వల్ల కామన్‌వెల్త్‌ క్రీడలకు దూరంగా ఉండనున్నట్లు మంగళవారం భారత హాకీ సంఘం ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌ వేదికగా వచ్చే ఏడాది జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్‌వెల్త్‌ క్రీడలు జరుగుతాయి. చైనాలో ఆసియా గేమ్స్‌ సెప్టెంబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 25 వరకు జరగనున్నాయి. ఈ రెండింటి మధ్య వ్యవధి 32 రోజులే ఉండటం.. కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉండటంతో భారత క్రీడాకారులను రిస్క్‌లో పెట్టలేమని హాకీ ఇండియా ప్రెసిడెంట్‌ గ్యానెండ్రో నింగోంబామ్‌ తెలిపారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నరిందర్‌ బాత్రాతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

భారత పురుషులు, మహిళల హకీ జట్లు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో బెర్తును ఖరారు చేసుకోవాలంటే ఆసియా క్రీడల్లో రాణించాల్సి ఉంటుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా.. మహిళల జట్టు సెమీఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి కామన్‌వెల్త్‌, ఆసియా క్రీడలకు మధ్య వ్యవధి కేవలం 32 రోజులు మాత్రమే ఉంది. అంతేకాకుండా బ్రిటన్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటంతో జట్లను పంపించేందుకు హాకీ ఇండియా సుముఖత వ్యక్తం చేయలేదు. యూకే నిబంధనల ప్రకారం 10 రోజుల క్వారంటైన్‌ ఉండాలి. అంతేకాకుండా ఇటీవల బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలను అంగీకరించేందుకు నిరాకరించింది. వ్యాక్సినేషన్‌ వేసుకున్నప్పటికీ పది రోజుల కఠినమైన క్వారంటైన్‌ను పాటించాల్సి వస్తుండటంతో టోర్నీకి వెళ్లకపోవడమే మేలని హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని