IND vs ENG: హాకీ వరల్డ్‌ కప్‌లో డ్రాగా ముగిసిన భారత్‌-ఇంగ్లాండ్ మ్యాచ్

చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాయి. రెండో ఆట గెలిచి పూల్‌ డీలో అగ్రస్థానంలో నిలవాలనుకున్న భారత్‌కు ఇంగ్లాండ్‌ గట్టి పోటీ ఇచ్చింది. 

Published : 16 Jan 2023 01:53 IST

భువనేశ్వర్‌: హాకీ పురుషుల ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన ఆట డ్రాగా ముగిసింది. నిర్ణీత 60 నిమిషాల ఆటలో ఇరు జట్లు గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. రెండో ఆటలో విజయం సాధించి పూల్‌ డీలో టాపర్‌గా నిలవాలనుకున్న భారత్‌కు ఇంగ్లాండ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. మ్యాచ్‌లో గోల్‌ కొట్టే అవకాశాలను ఇరుజట్ల ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి క్వార్టర్‌లో భార‌త ఆట‌గాడు హార్ధిక్ సింగ్ గోల్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ జట్టుకు అనేకమార్లు గోల్‌ వేసే అవకాశం లభించినప్పటికీ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. రెండో అర్థ‌భాగంలో భారత్‌ పెనాల్టీ గోల్ వేసే అవకాశాలను తృటిలో చేజార్చుకుంది.

మూడో క్వార్టర్‌లో గోల్‌ చేసేందుకు భారత్‌ దూకుడుగా ఆడినప్పటికీ ఇంగ్లాండ్‌ గోల్‌ కీపర్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఇంగ్లాండ్‌కు పెనాల్టీ గోల్‌ లభించినప్పటికీ.. దాన్ని పాయింట్‌గా మార్చుకోలేకపోయింది. దీంతో ఆట ముగిసేవరకు ఇరుజట్ల ఖాతాలో ఒక్క గోల్‌ కూడా నమోదుకాకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండు జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి. ఇంగ్లండ్ గోల్ కీప‌ర్ ఒలివ‌ర్ పైన్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. ప్రస్తుతం పూల్‌ డీలో ఇంగ్లాండ్‌ తొలి స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి. పూల్‌ డీలో అంతకుముందు జరిగిన మ్యాచ్ లో స్పెయిన్‌ 5- 1 గోల్స్ తేడాతో వేల్స్ పై విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని