Rahul Dravid: కోచ్‌గా అతడి హనీమూన్‌ కాలం ముగిసింది.. ద్రవిడ్‌పై మాజీ సెలెక్టర్‌ ఏమన్నాడంటే..

అయితే రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ ముందు భారత జట్టుకు ఇదొక మేల్కొలుపు లాంటిదని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు.

Published : 11 Sep 2022 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టైటిల్‌ ఫేవరెట్‌ జట్టుగా ఆసియా కప్‌లోకి అడుగుపెట్టిన టీమ్‌ ఇండియా.. పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే. సూపర్‌ 4 దశలో పాక్‌, శ్రీలంకపై ఓడి భారత అభిమానుల ఆశలను గల్లంతు చేస్తూ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. అయితే, త్వరలో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌ ముందు భారత జట్టుకు ఈ ఓటమి మేల్కొలుపు లాంటిదని మాజీ ఆటగాళ్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు ఇది ఎంతో కఠిన సమయమని బీసీసీఐ మాజీ సెలెక్టర్‌ సబా కరీమ్‌ అంటున్నారు. కోచ్‌గా అతడి హనీమూన్‌ కాలం ముగిసిందని, ఇక జట్టుపై గట్టిగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవిడ్‌ పనితీరుపై సబా ఓ క్రీడా ఛానల్‌తో  విశ్లేషించారు.

‘2021లో టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రవిడ్‌పై ఎన్నో అంచనాలు వెలువడ్డాయి. కోచ్‌గా హనీమూన్‌ కాలం ముగిసిందని ద్రవిడ్‌కూ తెలుసు. అతడు తన ఉత్తమ ప్రదర్శనను అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే.. జట్టులో ఆ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇది అతడికి కఠిన సమయం. అతడి కోచింగ్‌లో టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌, ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో విజయం సాధించడం ఆనందమే. అయితే ఇప్పుడు అతడి ముందు అసలైన సవాళ్లున్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్‌ రాబోతోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ కూడా ఉంది. ఈ రెండు పెద్ద ఐసీసీ ఈవెంట్లను భారత్‌ గెలుచుకోగలిగితే.. కోచ్‌గా అందించిన సేవలతో ద్రవిడ్ సంతృప్తి చెందుతాడు’ అని కరీం పేర్కొన్నారు.

ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ నంబర్‌ 1గా నిలిచి, SENA దేశాలలో టెస్టు సిరీస్‌లను గెలవడం ద్వారా కోచ్‌గా తన పదవీకాలం విజయవంతమవుతుందనే విషయాన్ని రాహుల్‌ అర్థం చేసుకోగలడని కరీం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని