Published : 30 Sep 2020 01:40 IST

2020.. తెవాతియా అయిపోతే ఎంత బాగుండు!

వైరల్‌గా మారిన రాజస్థాన్‌ ట్విటర్‌ హెడ్‌లైన్‌

(Twitter/RahulTewatia: నితీశ్‌ రాణాతో తెవాతియా)

2020.. జనవరి 1న అందరూ సంతోషంగా ఆంగ్ల సంవత్సరాది వేడుకలు జరుపుకొన్నారు. కొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో ఏడాదిని ఆరంభించారు. రెండు నెలలు గడిచిందో లేదో కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చైనాలో ఆవిర్భవించి సమస్త భూమండలం వ్యాపించింది. భారత్‌లోనూ ప్రవేశించింది. ఊహించని వేగంతో చాలామందిని కాటేసింది.

లాక్‌డౌన్లు.. ఆర్థిక నష్టాలు.. నిరుద్యోగం పెరిగిపోయాయి. సాటి మనిషిని ఆప్యాయతతో హత్తుకొనేవారే కరవయ్యారు. ఎడం పెరిగింది. మాస్క్‌లు ముఖాలకు ఆభరణాలుగా మారాయి. ఇంకా ఊహించని రీతిలో ప్రపంచవ్యాప్తంగా వరదలు.. వానలు.. తుపాన్లు.. కార్చిచ్చులు.. విస్ఫోటనాలు చోటు చేసుకున్నాయి.

ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది! కాలచక్రం అనూహ్యంగా మలుపులు తిరిగితే బాగుంటుందేమో అనిపిస్తోంది. మహమ్మారి కరోనా అంతమై హఠాత్తుగా ప్రశాంతత నెలకొంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ జట్టు తన ట్విటర్‌లో పెట్టిన ఓ వ్యాఖ్య అందరినీ ఆకట్టుకుంటోంది. ‘2020 రాహుల్‌ తెవాతియాగా మారాలని ఆశిస్తున్నాం’ అన్న మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌ మారాయి. ఎందుకంటే...

పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ ఆటగాడు రాహుల్‌ తెవాతియా అప్పటి వరకు అందరినీ విసిగించాడు. సింగిల్స్‌ తీసేందుకూ కష్టపడ్డాడు. ఆడిన తొలి 19 బంతుల్లో ఎనిమిది పరుగులే చేసి అభిమానుల సహనానికి పరీక్ష పెట్టాడు. ‘ఉతప్ప కాకుండా ఇతనెందుకు వచ్చాడ్రా బాబూ..!’ అనిపించాడు. కానీ హఠాత్తుగా గేర్లు మార్చి చివరి 12 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 45 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది ఔరా! అనిపించాడు. ఈ 2020 సంవత్సరం సైతం ఇప్పటి వరకు అందరినీ విసిగించింది. ఉన్నట్టుండి హాయిగా మారితే ఎంత బాగుంటుందో అనే అర్థంలో రాజస్థాన్‌ వ్యాఖ్య ఉండటంతో అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని