Siraj: వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్‌ ఆడతాడని ఆశిస్తున్నా: సిరాజ్‌ తల్లి

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి వన్డేలో సిరాజ్‌ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ సిరాజ్‌ గొప్పగా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్‌ ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడని ఆశిస్తున్నట్టు అతడి తల్లి తెలిపారు.

Published : 19 Jan 2023 17:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత గడ్డపై తన కుమారుడి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన సిరాజ్‌ తల్లి అతడు వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని కోరుకున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌ అతడికి ఎంతో ప్రత్యేకమైంది. సొంతమైదానంలో సూపర్ బౌలింగ్‌తో కివీస్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ కుటుంబసభ్యులు మాట్లాడిన వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. ‘‘దేశం గర్వించేలా నా కుమారుడు ఎదుగుతాడని ఆశిస్తున్నా. సిరాజ్‌ తన అద్బుతమైన ప్రదర్శనలతో ఆటలో ముందుకు సాగాలి. వన్డే ప్రపంచకప్‌లో సిరాజ్‌ ఆడతాడని ఆశిస్తున్నా’’ అని సిరాజ్‌ తల్లి తెలిపారు.

ఉప్పల్‌ మైదానంలో సిరాజ్‌ 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ మాట్లాడుతూ స్వస్థలంలో ఆడటం తనకెంతో ధైర్యాన్ని ఇస్తుందని తెలిపాడు.‘‘సొంత గడ్డపై ఇదే నా మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌. ఇదివరకు ఇక్కడ ఐపీఎల్‌ మాత్రమే ఆడాను. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ మ్యాచ్‌ చూడటానికి వస్తారు. అందువల్ల స్వస్థలంలో ఆడుతుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది’’ అని సిరాజ్‌ తెలిపాడు.జస్ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీతో జట్టులో సిరాజ్‌ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు‌. ఇక భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య రెండో వన్డే జనవరి 21న రాయ్‌పుర్‌లో జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని