Team India: జనవరి నుంచి పూర్తిస్థాయి జట్టుతో దిగేందుకు ప్రయత్నిస్తాం: ద్రవిడ్‌

గాయాల బెడద, పనిఒత్తిడి కారణంగా ఒక్కో సిరీస్‌కు వేర్వేరు జట్లను పంపించాల్సి వస్తోందని, అయితే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టు సన్నద్ధతపై కసరత్తు చేస్తామని కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించాడు.

Published : 08 Dec 2022 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రెండో వన్డే మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైన టీమ్‌ఇండియా సిరీస్‌ను కోల్పోయింది. ఇక నామమాత్రమైన చివరి వన్డే శనివారం జరగనుంది. గాయపడినా చివరి వరకు అద్భుతంగా పోరాడిన రోహిత్ శర్మను భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభినందించాడు. అలాగే పలు కీలక విషయాలపై మ్యాచ్‌ అనంతరం మాట్లాడాడు. మిడిల్‌ ఓవర్లలో బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సంబంధించి ఇబ్బందులపైనా స్పందించాడు. పూర్తిస్థాయి స్క్వాడ్‌ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నాడు. 

‘‘వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. దీంతో రాబోయే 8-9 నెలలు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తాం. న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లను కోల్పోవడంపై ఆత్మవిమర్శ చేసుకొంటాం. పని ఒత్తిడి, ఆటగాళ్లు గాయాలపాలు కావడం వల్ల వేర్వేరు జట్లను ఆయా సిరీస్‌లకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చే భారత టీ20 లీగ్‌కు ముందు భారత్‌ వరుసగా స్వదేశంలో మూడు దేశాలతో 9 వన్డేలను ఆడనుంది. తప్పకుండా పూర్తిస్థాయి జట్టుతోనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. గత రెండేళ్లు టీ20 ప్రపంచకప్‌లను దృష్టిలో ఉంచుకొని కేవలం పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టాం. రాబోయేది వన్డే ప్రపంచకప్‌. అందుకే 50 ఓవర్ల ఫార్మాట్‌పైనే ఫోకస్‌ పెట్టి జట్టును సన్నద్ధం చేస్తాం. అయితే వచ్చే మూడు నెలలు చాలా కీలకం. అయితే గాయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక బంగ్లాతో చివరి వన్డేకి రోహిత్‌తోపాటు కుల్దీప్‌ సేన్, దీపక్ దూరమయ్యారు. బంగ్లాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేం’’ రాహుల్ ద్రవిడ్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు