Afghanistan Cricket Team: తాలిబన్లను మెప్పించి.. తలరాతకు ఎదురీది.. అఫ్గాన్‌ క్రికెట్‌ ప్రయాణం..!

అఫ్గాన్‌లో క్రికెట్‌ అంటే కష్టమే. కానీ, తాలిబన్ల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందారు. మెల్లగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చారు. ఇప్పడు ఏకంగా భారీ జట్లకు షాకిచ్చి టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు చేరారు. వారి క్రికెట్‌ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయి.

Updated : 26 Jun 2024 09:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌ అంటే శరణార్థి శిబిరాల గుడారాల వద్ద ఆడుకొనే ఆటగా వారికి పరిచయమైంది.. మెల్లగా అది వారి మనసు దోచుకొంది. తిరిగి స్వదేశానికి వెళ్లే సమయంలో దానిని కూడా తమతో తీసుకెళ్లారు. అక్కడి మతఛాందస పాలకులను ఒప్పించారు.. పట్టుదలగా ప్రతి ఒక్కటి నేర్చుకొన్నారు.. తరాలు మారే కొద్దీ అక్కడి ఆట తలరాత మారిపోయింది. క్రికెట్‌ (Cricket)లో చిన్న చేపగా భావించిన అఫ్గాన్‌ జట్టు అనూహ్యంగా పెరిగి పెద్దదై సొరచేపగా మారి.. అగ్రశ్రేణి జట్ల విజయావకాశాలను తినేస్తోంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఆసీస్‌, న్యూజిలాండ్‌ వంటి మెగా జట్లను ఓడించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది. తన విజయాలేవీ అదృష్టంతో వచ్చినవి కాదని నిరూపించింది. 

తాలిబన్లనే మెప్పించి ఒప్పించి..

1980ల్లో సోవియట్‌ ఆక్రమణతో అందమైన అఫ్గానిస్థాన్‌ ఛిన్నాభిన్నమైంది. లక్షల మంది ప్రజలు పొరుగునున్న పాకిస్థాన్‌కు పారిపోయి పెషావర్‌ వంటి నగర శివార్లలో శరణార్థి శిబిరాల్లో తలదాచుకొన్నారు. అక్కడ వారికి క్రికెట్‌ (Cricket) పరిచయం అయింది. యుద్ధం ముగిశాక తాలిబన్ల పాలన మొదలైంది. శరణార్థి శిబిరాల్లో ఉన్నవారు ఆ ఆటను కూడా తమతోపాటు అఫ్గానిస్థాన్‌కు తీసుకెళ్లారు. 1995లో క్రికెట్‌ బోర్డును ఏర్పాటు చేశారు. తొలుత మిగిలిన ఆటల వలే దీనిపై తాలిబన్లు నిషేధం విధించారు. కానీ, కొన్నాళ్లకు ప్రజల్లో దీనికి ఉన్న ఆదరణ.. అభ్యంతరకరం కాని వస్త్రధారణ ఉండటంతో నిషేధం తొలగించారు. 2001లో తొలిసారి జాతీయ జట్టును తయారు చేశారు. నాటి నుంచి అక్కడ క్రికెట్‌పై ప్రేమ పెరుగుతోందే తప్ప తగ్గలేదు. 2009లో వన్డే హోదా, 2013లో ఐసీసీ అసోసియేట్‌ సభ్యత్వం, 2017లో టెస్ట్‌ హోదా లభించాయి.

వాస్తవానికి 2019లో తాలిబన్లు తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చే నాటికి ఈ జట్టు ‘అఫ్గాన్‌ రిపబ్లిక్‌’ గుర్తు, జాతీయ గీతంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేది. దేశంలో తిరుగుబాటు తర్వాత పరిస్థితి మారింది. కానీ, ఈ జట్టు పాత జెండా, జాతీయ గీతంతోనే అంతర్జాతీయ మ్యాచ్‌ (International Cricket Match)లు ఆడేందుకు తాలిబన్లు అనుమతించారు. తమ జట్టులో ప్రతిభను గమనించి వారు గతేడాది 1.2 మిలియన్‌ డాలర్ల నగదు సమకూర్చడం విశేషం. 

ఇప్పుడు అఫ్గాన్‌ (Afghanistan)లోని 34 ప్రావిన్సుల్లో 5 వేల క్రికెట్‌ క్లబ్బులున్నాయి. ఒక్క ఖోస్ట్‌లోనే 110 జట్లు తయారయ్యాయి. ఏటా జూన్‌-అక్టోబర్‌ వరకు క్లబ్‌ క్రికెట్‌ జరుగుతుంది. ఆ తర్వాత గ్రేడ్‌-2 ఆటకు సెలక్షన్‌, జనవరి సీజన్‌లో గ్రేడ్‌-1కు ఎంపికలు ఉంటాయి. మెల్లగా దేశీయంగా శిక్షణ సౌకర్యాలను సమకూర్చుకొంటున్నాయి. అఫ్గానీలు మిగిలిన ఫార్మాట్ల కంటే టీ20నే అత్యధికంగా ఆడతారు. 

ఆటలోనే ఆనందం వెతుక్కొన్న అఫ్గానీలు..

అఫ్గానిస్థాన్‌ క్రికెటర్ల (Afghanistan Cricketrs)లో నేర్చుకోవాలనే తపన చాలా ఎక్కువగా ఉంటుందని గతంలో కోచ్‌లుగా పనిచేసిన వారు వెల్లడించారు. మైదానంలో 30 నిమిషాలు పరిగెత్తమంటే.. వారు కనీసం గంట సేపు రన్నింగ్‌ చేస్తారని ఆ జట్టు మాజీ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఓ సందర్భంలో గుర్తు చేసుకొన్నారు. శిక్షణ విషయంలో వారు అస్సలు వెనక్కి తగ్గరని పేర్కొన్నాడు. యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న రోజుల్లో కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు తమ ఆత్మీయుల అంత్యక్రియలకు వెళ్లి కూడా శిక్షణకు వచ్చేవారని అసిస్టెంట్‌ కోచ్‌ రయిస్‌ అహ్మద్‌జాయ్‌ పేర్కొన్నాడు. జట్టుకు నిధుల కొరత ఉన్నా ఎలాంటి వంకలు పెట్టరు. 2006లో ఇంగ్లాండ్‌లో తొలిసారి ఆరు కౌంటీ మ్యాచ్‌ల్లో విజయం సాధించి జట్టు స్వదేశానికి వస్తే రిసీవ్‌ చేసుకోవడానికి కూడా ఎవరూ రాలేదు. చాలా మంది ఆటగాళ్ల వద్ద ట్యాక్సీకి డబ్బులు లేకపోవడంతో ఎయిర్‌ పోర్టు నుంచి ఇళ్లకు నడుచుకొంటూ వెళ్లారంటే వారి కమిట్‌మెంట్‌ అర్థం చేసుకోవచ్చు.

ఆవేశం తగ్గించుకొని..

2001లో జాతీయ జట్టు ఏర్పాటు నాటి నుంచి అఫ్గానిస్థాన్‌లో మంచి బౌలర్లు ఉన్నారు. ప్రత్యర్థులను వీరు ముప్పుతిప్పలు పెట్టేవారు. వారి బ్యాటర్లు కేవలం హార్డ్‌ హిట్టింగ్‌ను మాత్రమే నమ్మేవారు.. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ నిలకడ లోపించింది. 2015లో తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఆ జట్టు కేవలం స్కాట్లాండ్‌పై విజయంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో అసలు విజయమే లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాటింగ్‌ అంటే బౌండరీలు కొట్టడం ఒక్కటే కాదు.. భాగస్వామ్యాలు నిర్మించడం, సింగిల్స్‌, డబుల్స్‌ సాధిస్తూ స్ట్రైక్‌ను రొటేట్ చేయడాన్ని మెరుగుపర్చుకొన్నారు. 2023 ప్రపంచకప్‌లో ఇది స్పష్టంగా కనిపించింది.  వారి డాట్‌బాల్‌ పర్సంటేజి 65.8 నుంచి 52.1కి చేరింది. ఇక భాగస్వామ్యాల సగటు కూడా 2015తో పోలిస్తే రెట్టింపై 36కు చేరింది. జట్టు నిలకడైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ 2023 ప్రపంచకప్‌లో పాక్‌, ఇంగ్లాండ్‌ వంటి మాజీ ఛాంపియన్లకు షాకులిచ్చారు. ఆసీస్‌ను మూడు చెరువుల నీళ్లు తాగించారు. టీ20లు అత్యధికంగా ఆడటం వీరి సహజంగానే కలిసొచ్చే అంశంగా మారింది. తమదైన రోజున వీరు ఎంతటి జట్టునైనా పొట్టి ఫార్మాట్‌లో మట్టి కరిపించడం మొదలుపెట్టారు.  

అఫ్గానీలకు అండగా భారత్‌..

అఫ్గాన్‌ జట్టు (Afghan Cricket Team)కు ఐసీసీ అసోసియేట్‌ సభ్యత్వం రావడానికి భారత్‌ సాయం చేసింది. ఫలితంగా అక్కడ క్రికెట్‌ శిక్షణకు నిధులు పెరిగాయి. అంతేకాదు.. భారత్‌లో సకల సౌకర్యాలున్న మూడు మైదానాల్లో హోమ్‌ మ్యాచ్‌లు ఆడటానికి అవకాశం లభించింది. దీంతో ఇక్కడ శిక్షణకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇక లాల్‌ చంద్‌ రాజ్‌పుత్‌, మనోజ్‌ ప్రభాకర్‌, ఉమేష్‌ పత్వాల్‌, మాంటీ దేశాయ్‌ వంటి మాజీ క్రికెటర్లు వారికి శిక్షకులుగా పనిచేశారు. 2014లో భారత ప్రభుత్వం (India Government) ఆ జట్టుకు మిలియన్‌ డాలర్ల నిధులను కేటాయించింది. ఈ సొమ్ముతో కాందహార్‌లో ప్రపంచ స్థాయి స్టేడియం నిర్మించారు. 

2015 నుంచి హోం గ్రౌండ్‌ హోదాలో గ్రేటర్‌ నోయిడా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను వాడుకొనేందుకు భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత దేహ్రడూన్‌లోని క్రికెట్‌ స్టేడియాన్ని కేటాయించారు. ఇప్పుడు లఖ్‌నవూలోని మైదానాన్ని వారికి హోం గ్రౌండ్‌ కింద ఇచ్చారు. విదేశీ కోచ్‌లతో శిక్షణ పొందేందుకు ఇది వారికి చాలా ఉపయోగపడింది. 2023 వన్డే ప్రపంచకప్‌నకు మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా జట్టు మెంటార్‌ పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో సంచలనాలను సృష్టించింది. భారత్‌లో ఐపీఎల్‌ జట్లలో ఈ దేశ ఆటగాళ్లకు విరివిగా అవకాశాలు కల్పించారు. 2024 సీజన్‌లోని మొత్తం 10 జట్లలో ఆరింట కనీసం ఒక్క అఫ్గానీ క్రీడాకారుడు ఉన్నాడు. రషీద్‌ ఖాన్,నవీనుల్‌ హక్‌, గుర్బాజ్‌, ఫరూఖీ వంటి వారు ఇక్కడ ఆడి రాటుదేలారు. వీరు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఐదారు లీగుల్లో కూడా ఆడుతున్నారు. 

యూఏఈ అండగా..

తాలిబన్లు రెండోసారి అధికారం చేపట్టాక అఫ్గానీ క్రికెటర్ల (Afghanistan Cricketrs)కు వీసా సమస్యలు మొదలయ్యాయి. దీంతో యూఏఈ వీరికి సాయంగా ముందుకొచ్చి రెసిడెన్సీ పర్మిట్లను మంజూరు చేసింది. ఆ దేశంలోని షార్జా క్రికెట్‌ స్టేడియం సీఈవో ఖలాఫ్‌ బుక్తియార్‌ కూడా సహకరించారు. హోమ్‌ గ్రౌండ్‌గా వారి మైదానం వాడుకొనే అవకాశం కల్పించారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (Pakistan Cricket Board) కూడా అఫ్గాన్‌ ఆటగాళ్లకు చాలా సందర్భాల్లో శిక్షణకు సంబంధించి సాయం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని