Bumrah: బుమ్రా యాక్షన్‌ స్పెషల్‌.. అందుకే కదిలించరు..!

టీమ్‌ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్‌. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్‌ లైనప్‌ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం..

Updated : 30 Jun 2024 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘బ్యాటర్లు మ్యాచ్‌లు గెలిపిస్తే.. బౌలర్లు టోర్నమెంట్లను అందిస్తారు’’ ఇది క్రికెట్‌ సర్కిల్స్‌లో తరచు వినిపించే నానుడి. పొట్టి ప్రపంచకప్‌లో ఇదే నిజమని తేలింది. సాధారణంగా ఈ ఫార్మాట్‌ బ్యాటర్లది. కానీ, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు మాత్రం టీమ్‌ ఇండియా ఏస్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రాను వరించింది. పోనీ టోర్నీలో అత్యధిక వికెట్లు తీశాడా..? అంటే కాదు.. అతడి కంటే ముందు స్థానాల్లో అర్ష్‌దీప్‌, ఫరూఖీ ఉన్నారు. మరి బుమ్రాను ఈ అవార్డు ఎలా వరించింది అంటే పొదుపైన బౌలింగ్‌.

పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలోనే పొదుపరిగా..

భారత్‌ స్క్వాడ్‌లో అతడు ఉంటే ప్రత్యర్థికి కొన్ని ఓవర్లు కోతపడినట్లే. ఎందుకంటే అతడు వేసే తూటాల్లాంటి బంతుల్లో సగం ఆడలేక బ్యాటర్లు చేతులెత్తేస్తారు. పొట్టి ప్రపంచకప్‌ ఎడిషన్‌లో కనీసం 20 ఓవర్లు వేసిన వారిలో అత్యంత పొదుపైన బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రానే. సాధారణంగా టీ20ల్లో బౌలర్‌కు 6 ఎకానమీ ఉంటే గొప్ప. అలాంటిది బుమ్రాకు 4.17. అంటే ప్రత్యర్థులను ఏ స్థాయిలో ముప్పుతిప్పలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 178 బంతులు వేయగా.. వాటిల్లో 110 డాట్‌ బాల్సే. ఇక 124 పరుగులే ఇచ్చాడు. వీటిల్లో రెండు మెయిడిన్లు. 15 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్స్‌లో డాట్‌బాల్స్‌తో మ్యాచ్‌ను తిప్పేశాడు. పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యంత పొదుపైన బౌలర్‌గా నిలిచాడు.

ప్రత్యేకమైన యాక్షన్‌..

షార్ట్‌ రనప్‌తో జస్సీ బౌలింగ్‌ యాక్షన్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అతడు దానిని టీవీల్లో చూసి స్వయంగా నేర్చుకొన్నాడు. ఎవరూ చెప్పింది కాదు. బుమ్రా తండ్రి ఏడేళ్ల వయస్సులోనే చనిపోవడంతో తల్లి దల్జిత్‌ అతడిని పెంచింది. ఆమె అహ్మదాబాద్‌ వద్ద వస్త్రపుర్‌లోని నిర్మాన్‌ స్కూల్‌ వైస్‌ ప్రిన్సిపల్‌. ఆ పాఠశాల కోచ్‌లు కిశోర్‌ త్రివేది, కెతుల్‌ పురోహిత్‌ నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ చూశారు. అతడికి శిక్షణ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మారు. కేవలం లైన్‌అండ్‌లెంగ్త్‌పై అతడు దృష్టిపెడితే చాలని భావించారు. బౌలింగ్‌ యాక్షన్‌ మార్చవద్దని మాత్రం సలహా ఇచ్చారు. శిక్షణలో అతడి యార్కర్లు మరింత పదును తేలాయి. అప్పట్లో ఐపీఎల్‌ ఆటగాడు సిద్ధార్థ్‌ నుంచి సూచనలు లభించాయి. స్థానిక టోర్నమెంట్లలో గంటకు 140 కిమీ వేగంతో అదరగొట్టడం మొదలుపెట్టాడు.

అమ్మకు ఇష్టం లేకపోయినా..

తల్లి దల్జిత్‌కు మాత్రం జస్సీ క్రికెట్‌ ఆడటం అంటే ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ, కోచ్‌ త్రివేది, పురోహిత్‌ నచ్చజెప్పారు. దీంతో రెండేళ్లపాటు క్రికెట్‌ ఆడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అనంతరం కఠినంగా సాధన చేసిన బుమ్రా 19 ఏళ్ల వయస్సులో నాటి ముంబయి ఇండియన్‌ కోచ్‌ జాన్‌రైట్‌ కంటపడ్డాడు. తమ లీగ్‌ జట్టుకు ఎంపిక చేశారు.

కానీ, అతడు జిల్లా అండర్‌-19 జట్టుకు మాత్రం రిజర్వుగానే ఎంపికయ్యాడు. అతడి విభిన్న బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా బెంచ్‌కు పరిమితం చేశారు. ఎట్టకేలకు ఓ మ్యాచ్‌లో అవకాశం రావడంతో ఏకంగా ఏడు వికెట్లు సాధించినట్లు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన అనిల్‌పటేల్‌ వెల్లడించారు. ఆ తర్వాత సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో  పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే ఐపీఎల్‌లో ముంబయి తరఫున ఆర్సీబీపై పోరుకు బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లోనే విరాట్‌ సహా ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత సీజన్‌కు అతడిని ముంబయి కొనసాగించింది. అందరు ఆటగాళ్లు రంజీ ఆడి తర్వాత లీగ్‌లోకి వస్తారు. కానీ, జస్సీ లీగుల్లోకి వచ్చాక రంజీ జట్టుకు ఆడాడు.

2015-16లో విజయ్‌ హజారే ట్రోఫీలో ఓ అంపైర్‌ జస్సీ బౌలింగ్‌ యాక్షన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశాడు. దీంతో గుజరాత్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడికి అండగా నిలిచింది. కొన్నాళ్లకే టీమ్‌ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో సభ్యుడయ్యాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 397 వికెట్లు సాధించాడు. మొత్తం 13,271 బంతులు వేసి..8,379 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

ఒరిజనల్‌ అలానే ఉంది..

బుమ్రా టీమ్‌ ఇండియాకు అపురూపమైన బౌలర్‌. అతడి బౌలింగ్‌ యాక్షన్‌ మార్చేందుకు ఏ కోచ్‌ యత్నించలేదు. బంతి వేయడానికి ముందు తొలుత కొంత నడిచి.. ఆ తర్వాత రనప్‌ అందుకోవడం అతడిశైలి. ‘‘నేను మొదట టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ ఆడాను. అప్పట్లో బౌండరీ చాలా చిన్నదిగా ఉండేది. అందుకే నేను మరీ ఎక్కువ రనప్‌ తీసుకోను. బంతి వేసే సమయంలో తొలుత నడిచేవాడిని కాదు.. పరుగుపైనే దృష్టిపెట్టేవాడిని. కానీ, రన్‌ కోసం అనవసరంగా చాలా శక్తి వేస్ట్‌ చేసుకొంటున్నా అని ఆ తర్వాత అనిపించింది. ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు. అలా యాక్షన్‌లో మార్పులు చేసుకొన్నాను’’ అని ఓ సందర్భంగా వెల్లడించాడు. 

మొదట్లోనే వికెట్లు తీసి ప్రత్యర్థులను కట్టడి చేయడం.. డెత్‌ ఓవర్లలో వారికి ఊపిరాడనీయకుండా చేయడం బుమ్రా స్టైల్‌. ఇప్పటికీ టీమ్‌ ఇండియా, లీగ్‌ల్లో అతడికి బౌలింగ్‌పై ఎవరూ ఎక్కువ సలహాలు ఇవ్వరు. అతడి వ్యూహం ప్రకారమే బౌలింగ్‌ చేసే స్వేచ్ఛను ఇస్తారు. తాజాగా టీమ్‌ ఇండియా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. దటీజ్‌ బూమ్‌ బూమ్‌ బుమ్రా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు