Virat and Rohit: విరాట్‌ - రోహిత్‌లకు ముప్పు పొంచి ఉందిలా..!

టీమ్‌ ఇండియా ఓపెనర్లు రోహిత్‌ - విరాట్‌ మన బ్యాటింగ్‌ లైనప్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. వీరిలో ఒక్కరు రెచ్చిపోయినా జట్టు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంగ్లాండ్‌ అమ్ముల పొదిలో వీరిపై ప్రయోగించడానికి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో చదవండి.

Updated : 27 Jun 2024 19:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు ఆ ఇద్దరు వెన్నెముక. వారిలో ఒక్కరు చెలరేగినా ప్రత్యర్థి జట్టు గెలుపుపై ఆశలు వదలుకోవాల్సిందే. ఏ బౌలర్‌పైన అయినా గురిపెట్టారో అతడు కెరీర్‌ చరమాంకానికి చేరాల్సిందే. వారే రోహిత్‌ - విరాట్‌ (Virat & Rohit). వీరిద్దరూ పొట్టి ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) టీమ్‌ ఇండియా ఓపెనర్లుగా వస్తున్నారు. గతంలో గంగూలీ - సచిన్‌ తర్వాత అంతటి స్టార్‌ ఆటగాళ్ల ఓపెనింగ్‌ జోడీ ఇదే కావచ్చు. వీరు బంతిపై రెచ్చిపోతే ఇంగ్లాండ్‌  ‘ఫైనల్‌’ ఆశలు అడియాశలే. కానీ, గ్రూప్‌, లీగ్‌ దశలు వేరు.. ఒక మ్యాచ్‌ పోయినా.. మరో దానిలో కవర్‌ చేసుకోవచ్చు. ఇది నాకౌట్‌. ఏ మాత్రం తేడా వచ్చినా జట్టు ప్యాకప్‌ అవ్వాల్సిందే. గత కొన్నేళ్లుగా భారత్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తోందనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో టీ 20 ప్రపంచకప్‌ నాకౌట్లలో మన స్టార్‌ ఓపెనర్ల ఆటతీరును చూద్దాం. అలాగే ఈ మ్యాచ్‌లో వీరిద్దరికి పొంచి ఉన్న ముప్పులను గమనిద్దాం.

ఫైనల్స్‌లో చితకబాదిన రోహిత్‌..

రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌ టోర్నీల నాకౌట్‌ మ్యాచ్‌ల్లో రాణించిన రికార్డే ఉంది. మొత్తం 6 మ్యాచ్‌లు ఆడగా 40 సగటు, 135 స్ట్రయిక్‌ రేటుతో 161 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో చెలరేగిన చరిత్రా ఉంది. 2007 ఫైనల్స్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ తలపడింది. ఆ హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శర్మ కేవలం 16 బంతుల్లో 30 బాది జట్టుకు కప్పు ఇప్పించాడు. ఆ పొట్టి ప్రపంచకప్‌ సెమీస్‌లో కూడా ఐదు బంతుల్లో 8 కొట్టాడు. 

ఆ తర్వాత టోర్నీల్లో ఆడిన మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన హిట్‌ మ్యాన్‌ దక్షిణాఫ్రికాపై 24 (13 బంతుల్లో), లంకపై 29 (26), విండీస్‌పై 43 (31)తో మెరుగ్గానే ఆడాడు. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌తో అడిలైడ్‌లో జరిగిన సెమీస్‌లో 28 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులే చేశాడు. ఆ మ్యాచ్‌ భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. అసలే రివెంజ్‌ మూడ్‌లో ఉన్న శర్మ నేటి మ్యాచ్‌లో లెక్క సరిచేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

ఆర్చర్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే..

ఇంగ్లాండ్‌కు 29 ఏళ్ల కుడిచేతి వాటం సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌తో రోహిత్‌ అప్రమత్తంగా ఉండాల్సిందే. టీ20ల్లో అతడి నుంచి 20 బంతులను ఎదుర్కొన్న రోహిత్‌ కేవలం 17 పరుగులు మాత్రమే చేసి మూడుసార్లు వికెట్‌ సమర్పించుకొన్నాడు. సో బీకేర్‌ ఫుల్‌ హిట్‌మ్యాన్‌.

ఒత్తిడి మ్యాచ్‌ల్లో చెలరేగిపోయే కింగ్‌..

సాధారణంగా తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు తప్పులు ఎక్కువ చేసి ఓటమి పాలవుతుంటారు. కానీ, ఛాంపియన్‌ స్థాయి ఆటగాళ్లు ఒత్తిడిలో మరింత ఏకాగ్రతగా ఆడి ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. ఈ కోవలోకి వచ్చే ఆటగాడు విరాట్‌ కోహ్లీ. ఈ టోర్నీలో అతడి నుంచి పెద్ద మెరుపులు కనిపించలేదు. పైగా రెండుసార్లు డకౌట్‌ కావడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. 

ఇక గత పొట్టి ప్రపంచకప్‌ నాకౌట్లలో కోహ్లీ చెలరేగిపోయి ఆడాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ 144 సగటు, 152 స్ట్రయిక్‌ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. వీటిల్లో విండీస్‌పై అతడు 2016లో కొట్టిన 41 బంతుల్లో 89 అత్యధిక స్కోర్‌. నాలుగు మ్యాచ్‌ల్లో అతడు నాలుగు అర్ధశతకాలు చేశాడు. 2014లో దక్షిణాఫ్రికాపై 72, శ్రీలంకపై 2014లో 77, ఇంగ్లాండ్‌పై 2022లో 50 రన్స్‌ చేశాడు. 

ఆదిల్‌తో జర జాగ్రత్త..

ఇంగ్లాండ్‌ జట్టులో విరాట్‌కు ఆదిల్‌ రషీద్‌ రూపంలో టీమ్‌ ఇండియాకు ముఖ్యంగా విరాట్‌కి ముప్పు పొంచి ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఏ ఫార్మాట్‌లోనైనా ఏకంగా తొమ్మిదిసార్లు కోహ్లీని అతడు పెవిలియన్‌కు చేర్చాడు. ఈ బలహీనతను అధిగమించాలని కింగ్‌ భావిస్తే.. రషీద్‌కు నేటి మ్యాచ్‌లో చుక్కలు చూపించడం ఖాయం. లెఫ్టార్మ్‌ పేసర్లకు వికెట్లు సమర్పించుకుంటాడనే అపవాదును గత మ్యాచ్‌లో రోహిత్‌ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో చితకబాది చెరిపేసుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్‌ను స్ఫూర్తిగా తీసుకొని విరాట్‌ ఈసారి ఆదిల్‌ అంతుచూడాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. 

మరిన్ని ఆసక్తికర పోరాటాలు..

  • ఇంగ్లాండ్‌ టీమ్‌ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ జాస్‌ బట్లర్‌ను కట్టడి చేసే ఆయుధం మన వద్ద ఉంది. దాని పేరు జస్ప్రీత్‌ బుమ్రా. టీ20ల్లో ఏకంగా డజను మ్యాచుల్లో నాలుగుసార్లు బట్లర్‌ను అతడు ఔటు చేశాడు. మొత్తం అతడికి 89 బంతులు వేయగా వాటిల్లో 49 డాట్‌ బాల్సే. కాకపోతే పవర్‌ ప్లేలో ఒక్కసారి కూడా అతడి వికెట్‌ తీయలేకపోతున్నాడు బుమ్రా. దానిని ఈసారి అధిగమిస్తాడని ఆశిద్దాం.  
  • మిడిల్‌ ఓవర్లలో ప్రత్యర్థులను ఇబ్బందిపెట్టిన మన బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు ఇంగ్లాండ్‌లో మొయిన్‌ ఆలీ రూపంలో పోటీ ఉంది. ఇప్పటివరకు టీ20ల్లో కుల్దీప్‌ వేసిన 21 బంతులు ఎదుర్కొన్న అలీ 49 పరుగులు సాధించాడు. కాకపోతే రెండుసార్లు వికెట్‌ సమర్పించుకొన్నాడు. ఈసారి పైచేయి ఎవరిది అవుతుందో చూద్దాం. 
  • భారత్‌, ఇంగ్లాండ్‌ తలపడిన గత ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట భారత్‌ విజయం సాధించింది. కానీ, చివరి రెండు మ్యాచ్‌లు వరుసగా ఇంగ్లాండ్‌ గెలిచింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని