కపిల్‌ డెవిల్స్‌తో పెట్టుకొంటే.. కాగితం తినాల్సొచ్చింది..!

ఓ వ్యక్తి బిస్కెట్‌ వంటి దాన్ని తింటున్నట్లున్న పై ఫొటో చూశారుగా. ఈ ఫోటో చాలా ఫేమస్‌. ఫొటోలోని ఆ పెద్దాయన పేరు డేవిడ్‌ ఫ్రిత్‌. ప్రఖ్యాత విజ్డన్‌ క్రికెట్‌ మ్యాగ్జైన్‌కు 1983లో ఎడిటర్‌గా పనిచేశారు.

Published : 24 Dec 2021 01:23 IST

 క్రికెట్‌ పండితులకు గుణపాఠం చెప్పిన టీమ్‌ ఇండియా

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఓ వ్యక్తి బిస్కెట్‌ వంటి దాన్ని తింటున్నట్లున్న పైఫొటో చూశారుగా. ఈ ఫోటో చాలా ఫేమస్‌. ఫొటోలోని ఆ పెద్దాయన పేరు డేవిడ్‌ ఫ్రిత్‌. ప్రఖ్యాత విజ్డన్‌ క్రికెట్‌ మ్యాగజీన్‌కు 1983లో ఎడిటర్‌గా పనిచేశారు. నాటి ప్రపంచకప్‌కు ముందు విజ్డన్‌ మ్యాగజీన్‌లో ఆయన ఒక వ్యాసం రాశాడు. భారత్‌ ప్రపంచకప్‌ గెలిస్తే తన పదాలు వెనక్కి తీసుకొంటానని సవాలు విసిరాడు. అందుకోసం ‘eat my words’ అనే నుడికారాన్ని వాడాడు..! ఆ  పదానికి ఎలా మూల్యం చెల్లించాల్సివచ్చిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి..!

ఓ ఆవేశం.. ఓ పట్టుదల.. ఆశా నిరాశల మధ్య దోబూచులాట.. అంతిమంగా ఓ మధుర విజయం..! ఇదీ1983 ప్రపంచకప్‌ కప్‌ మిగిల్చిన మధుర జ్ఞాపకం. భారత్‌ విజయంలో నాటకీయత ఏ ‘లగాన్‌’ చిత్రానికీ తీసిపోదు..! అంతకుముందు 1975, 1979లలో జరిగిన రెండు ప్రపంచకప్‌ల్లో కలిపి భారత్‌ కేవలం ఒకే ఒక్క విజయం (ఈస్ట్‌ ఆఫ్రికాపై) సాధించింది. దీంతో 1983 టోర్నీలో పాయింట్ల పట్టికలో భారత్‌దే చివరి స్థానం అని క్రికెట్‌ పండితులు జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. భారత్‌ గెలిస్తే ఒక రూపాయికి రూ.66 ఇచ్చేట్లు బెట్టింగ్‌లు జరిగాయి. వాస్తవానికి భారత జట్టులోని ఆటగాళ్లకే టోర్నీ మొదలయ్యే వరకు గెలుస్తామనే నమ్మకం లేదు. 

ఆశ.. 

భారత ఆటగాళ్లు ఎలాంటి ఆశలూ లేకుండా ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టారు. అర్హత పోటీల్లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. లీగ్‌ దశలో మిగిలిన మూడు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌. యశ్‌పాల్‌ శర్మ రాణించడంతో భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. వాస్తవానికి ఈ టోర్నీకి కొన్నాళ్ల ముందు కూడా భారత్‌ ఒకసారి వెస్టిండీస్‌ను ఓడించింది. ఆ మ్యాచ్‌లో కూడా యశ్‌పాల్‌ రాణించడం విశేషం. ఇక రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను ఓడించడంతో భారత్‌ జట్ట ప్రపంచ కప్‌ల్లో తొలిసారి వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. దీంతో ఆటగాళ్లలో కప్‌పై ఆశలు చిగురించాయి. 

నిరాశ..

మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాభవం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 320 పరుగులు చేసింది. భారత్‌ 158 పరుగులకే చాపచుట్టేసింది. కపిల్‌ ఐదు వికెట్ల రికార్డు (5/43) సాధించడం ఒక్కటే ఊరట. ట్రెవోర్‌ చాపెల్‌ 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత నాలుగో మ్యాచ్‌ మళ్లీ వెస్టిండీస్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ ప్రతీకారం తీర్చుకొంది. వివియన్‌ రిచర్డ్స్‌ భారత బౌలర్లను చితక్కొట్టి 119 పరుగులు చేశాడు. దీంతో భారత్‌ 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పటికి టీమ్‌ ఇండియా రెండు విజయాలు.. రెండు అపజయాలు మూటగట్టుకొంది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. 

ఆత్మవిశ్వాసం..

జింబాబ్వేతో జరిగిన ఐదో మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్‌ చేరుకొన్నారు. 17 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో సగటు అభిమాని ప్రపంచకప్‌పై ఆశలు వదులుకొన్నాడు. అప్పుడే కపిల్‌ బ్యాటింగ్‌లో విశ్వరూపం చూపించాడు. 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది భారత్‌ను 266 పరుగుల వద్దకు చేర్చాడు. జింబాబ్వేను 235 వద్దే ఆలౌట్‌ చేశారు. ఈ మ్యాచ్‌తో భారత్‌కు కపిల్‌దేవ్‌ అనే క్రికెట్‌ దేవుడు లభించాడు. ఈ విజయం భారత్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఆ తర్వాత మ్యాచ్‌లో భారత్‌ 247 పరుగులు చేసింది. భారత బౌలర్‌ మదన్‌ లాల్‌ విజృంభించి నాలుగు వికెట్లు తీసుకొని ఆసీస్‌ వెన్నువిరిచాడు. ఫలితంగా 129కే ఆలౌటైంది. 

గ్రూప్‌-బి నుంచి భారత్‌, వెస్టిండీస్‌; గ్రూప్‌- ఎ నుంచి ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ జట్లు సెమీస్‌కు చేరాయి. ఇంగ్లాండ్‌ మీడియా కాకిలెక్కలు వేసి భారత్‌పై ఇంగ్లాండ్‌ గెలిచి ఫైనల్స్‌కు వెళుతుందని విశ్లేషించాయి. వెస్టిండీస్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఫైనల్స్‌ జరుగుతాయని పేర్కొన్నాయి. కానీ, ఓల్డ్‌ ట్రాఫర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో వారి అంచనాలు తారుమారు చేస్తూ.. చాలా సునాయాసంగా భారత్‌ ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 213 పరుగులు చేయగా.. భారత్‌ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 5.2 ఓవర్లు మిగిలి ఉండగానే 217 పరుగులు చేసింది. అదే రోజు ఓవల్‌మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను విండీస్‌ సునాయాసంగా ఓడించి ఫైనల్స్‌లో బెర్త్‌ ఖాయం చేసుకొంది.

భారత్‌ పట్టుదలకు ప్రతిరూపం ఫైనల్స్‌..!

83 నాటి వెస్టిండీస్‌ జట్టు సూపర్‌ స్టార్లతో కిక్కిరిసిపోయింది. గార్డన్‌ గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌ హేన్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌, క్లైవ్‌లాయిడ్‌తో బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌.. ఆండీ రాబర్ట్స్‌, జోయల్‌ గార్నర్‌, మాల్కం మార్షల్‌, మైకెల్‌ హోల్డింగ్స్‌ వంటి అరివీర భయంకర ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. భారత్ జట్టులో ఓపెనర్లు ఫామ్‌లో లేకపోవడం పెను సమస్యగా మారింది. ముఖ్యంగా గావాస్కర్‌..! 

ఫైనల్‌ రోజు కపిల్‌దేవ్‌ వెళ్లి లార్డ్స్‌లో వికెట్‌ను చూశాడు. ఆకుపచ్చటి రంగులో పిచ్‌ తళతళా మెరిసిపోతోంది. ఔట్‌ఫీల్డ్‌కు పిచ్‌కు మధ్య పెద్దగా తేడా కనిపించలేదు. అది సీమర్లకు స్వర్గధామం అని అర్థమైపోయింది. అలాంటి వికెట్‌పై ఎవరూ తొలుత బ్యాటింగ్‌ చేయాలనుకోరు. కానీ, భారత్‌ టాస్‌ ఓడిపోయింది. ఫలితంగా బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. రెండు పరుగుల స్కోర్‌ వద్ద సునీల్‌ గావాస్కర్‌ను ఆండీ రాబర్ట్స్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత కృష్ణమాచారి శ్రీకాంత్‌- మొహిందర్‌ అమర్‌నాథ్‌ కలిసి ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. ఫలితం టీమ్‌ ఇండియా 50 పరుగులు దాటింది. స్కోరు 59 వద్ద శ్రీకాంత్‌ (38)ను మాల్కం మార్షల్‌ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఈ మ్యాచ్‌లో అదే అత్యధిక స్కోర్‌. జట్టు 90 పరుగుల మధ్య అమర్‌నాథ్‌ (26) హోల్డింగ్స్‌ ఇన్‌కట్టర్‌కు అవుటయ్యారు. ఆ తర్వాత మరో 93 మూడు పరుగులు చేసి టీమిండియా ఆలౌట్‌ అయింది.

భారత ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ల బ్యాటింగ్‌ గురించి చెప్పుకోవాలి. మదన్‌ లాల్‌ (17), కిర్మానీ (14*), బల్విందర్‌ సంధు (11) కలిసి జట్టుకు కీలకమైన 42 పరుగులు అందించారు. సంధు గాయపడి కూడా ఆ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎక్స్‌ట్రాల రూపంలో విండీస్‌ బౌలర్లు మరో 20 పరుగులు సమర్పించుకొన్నారు. అంటే 183 పరుగుల్లో 62 పరుగులు ప్రధాన బ్యాట్స్‌మన్‌ నుంచి రాలేదన్నమాట..!

వేట మొదలు..! 

54.4 ఓవర్లకే (అప్పట్లో 60 ఓవర్లకు మ్యాచ్‌) మ్యాచ్‌ ముగియడంతో టీమ్‌ ఇండియా ఆటగాళ్లు భోజనం పూర్తి చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. పచ్చిక ఎక్కువగా ఉన్న వికెట్‌పై 183 పరుగులు ఆషామాషీ లక్ష్యం కాదని టీమ్ ఇండియా ఆటగాళ్లు ధైర్యం తెచ్చుకొని మైదానంలోకి అడుగుపెట్టారు. కపిల్‌ ఓవర్‌లో డెస్మండ్‌ హేన్స్‌ ఒక ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బల్విందర్‌ సంధు ఒక అద్భుతమైన ఇన్‌-స్వింగర్‌తో గార్డన్‌ గ్రీనిడ్జ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి విండీస్‌ స్కోరు కేవలం ఐదు పరుగులు మాత్రమే. ఆ తర్వాత వివియన్‌ రిచర్డ్స్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. కపిల్‌ దేవ్‌, మదన్‌లాల్‌ వంటి వారి బౌలింగ్‌లో ఫోర్ల వరదను పారించాడు. విండీస్‌ స్కోర్‌ 50 వద్దకు చేరాక హేన్స్‌ను మదన్‌ లాల్‌ ఔట్‌ చేశాడు. దీంతో కెప్టెన్‌ క్లైవ్‌లాయిడ్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు. ప్రత్యర్థులు అతడిని ముద్దుగా బిగ్‌ సీ, సూపర్‌ క్యాట్‌ అని పిలుస్తారు. ఆసీస్‌తో 1975 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో విండీస్‌ 50/3 వద్ద ఉన్నప్పుడు రంగంలోకి దిగి 88 బంతుల్లో 102 పరుగులు చేసి దేశానికి కప్పు అందించాడు. అత్యంత ప్రమాదకారి.

మరోవైపు రిచర్డ్స్‌ ఊచకోత ఆగలేదు. కేవలం 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒకే ఓవర్‌లో మూడు ఫోర్లు ఇచ్చిన మదన్‌లాల్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించాలని కెప్టెన్‌ కపిల్‌ భావించాడు. కానీ, మదన్‌ చాలా ఆత్మవిశ్వాసంగా మరో అవకాశం ఇవ్వాలని వాదించాడు. రిచర్డ్స్‌ను ఔట్‌ చేసి తీరతానని చెప్పాడు. కపిల్‌ అతడి మాట కాదనలేక బంతి ఇచ్చాడు. ఆ ఓవర్లో రిచర్డ్స్‌ అహాన్ని రెచ్చగొట్టేలా ఓ బంతిని వేశాడు. దానిని రిచర్డ్స్‌ గాల్లోకి కొట్టగా.. కపిల్‌ వెనక్కి పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్‌ అందుకొన్నాడు. అప్పటికి విండీస్‌ స్కోర్‌ కేవలం 57..! ఆ సమయంలో మైదానం ప్రేక్షకుల అరుపులతో దద్దరిల్లిపోయింది. రిచర్డ్స్‌ స్థానంలో లారీ గోమోస్‌ మైదానంలోకి అడుగుపెట్టాడు.

గాయపడిన ‘సూపర్‌ క్యాట్‌’..!

83 ఫైనల్స్‌లో లాయిడ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించిన వెంటనే తొడ వద్ద గాయం అయ్యింది. దీంతో రన్నర్‌ సాయంతో ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రిచర్డ్స్‌ ఔట్‌ కావడంతో లాయిడ్‌పై ఒత్తిడి పెరిగింది. గోమోస్‌ (5) కూడా మదన్‌లాల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరుకున్నాడు. అప్పటికి టీమ్‌ స్కోరు 66/4. ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద రోజర్‌ బిన్నీ బౌలింగ్‌లో లాయిడ్‌ షాట్‌ కొట్టగా కపిల్‌ క్యాచ్‌ అందుకొన్నాడు. భారత్‌కు విజయంపై పక్కా అని నిర్ధారణైపోయింది. ఆ సమయంలో విండీస్‌ స్కోర్‌ 66/5కు చేరింది. మరో 10 పరుగులు జోడించిన తర్వాత విండీస్‌ బాచస్‌ (8) వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత డూజోన్‌ (25), మాల్కం మార్షల్‌ (18) వికెట్ల పతనాన్ని కొద్దిసేపు అడ్డుకొన్నా.. భారత విజయాన్ని ఆపలేకపోయారు. విండీస్‌ స్కోర్‌ 119 చేరిన తర్వాత డూజోన్‌ను బౌల్డ్‌ చేసి ఈ భాగస్వామ్యానికి అమర్‌నాథ్‌ తెరదించాడు. మరో 21 పరుగులు జోడించి విండీస్‌ బ్యాట్స్‌మన్లు మొత్తం పెవిలియన్‌కు చేరుకొన్నారు. 140 పరుగులకు ఆ జట్టు ఆలౌట్‌ అయింది. ప్రపంచకప్‌ చరిత్రలో ఛాంపియన్‌ను మట్టికరిపించిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది. 


అప్పటి ముచ్చట్లు..

లాయిడ్‌ రాజీనామా..

విండీస్‌ ఇన్నింగ్స్‌లో రిచర్డ్స్‌ కొట్టిన ఏడు ఫోర్లను పక్కనపెడితే.. మిగిలిన బ్యాట్స్‌మెన్లు కొట్టింది మూడు ఫోర్లు మాత్రమే. వాటిల్లో రెండు హేన్స్‌, ఒకటి లాయిడ్‌ సాధించారు. జెఫ్‌ డూజోన్‌ మాత్రం ఏకైక సిక్సర్‌ కొట్టాడు. కపిల్‌ 11 ఓవర్లు వేయగా వాటిల్లో నాలుగు మెయిడిన్లు కావడం విశేషం..! మ్యాచ్‌ అయిపోయిన వెంటనే లాయిడ్‌ విండీస్‌ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.


మ్యాచ్‌ పూర్తి కాకముందే వెళ్లిపోయిన కపిల్‌భార్య..

తమ భర్తలను ఫైనల్స్‌లో ఉత్సాహపర్చేందుకు కపిల్‌ భార్య రోమి భాటియా, మదన్‌లాల్‌ భార్య అనూ స్టేడియానికి వచ్చారు. కానీ, రిచర్డ్స్‌ బ్యాటింగ్‌ చూసిన వారు భారత్‌ ఓటమి ఖాయమని భావించి కోపంతో స్టేడియం నుంచి సమీపంలో తాము బసచేసిన హోటల్స్‌కు వెళ్లిపోయారు. కొద్దిసేపటి ఒక్కసారి స్టేడియం నుంచి ప్రేక్షకుల హోరు విని కుతూహలంతో టీవీ ఆన్‌ చేశారు. వివియన్‌ రిచర్డ్స్‌ను మదన్‌లాల్‌ బౌలింగ్‌లో కపిల్‌ క్యాచ్‌ పట్టినట్లు గ్రహించారు. కపిల్‌ భార్య రోమి ఆనందం కేకలు వేయడంతో.. ఏమైందో అనుకొని హోటల్‌ సిబ్బంది పరిగెత్తుకుంటూ ఆమె రూమ్‌కు వచ్చారు. 


బీసీసీఐ అధ్యక్షుడికే టికెట్లు ఇవ్వలేదు..!

1983లో భారత్‌ ఫైనల్స్‌ చేరడంతో నాటి బీసీసీఐ అధ్యక్షుడు, కేంద్రమంత్రి ఎన్‌కేపీ సాల్వే ఇంగ్లాండ్‌కు వెళ్లి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకొన్నాడు. ఇందుకోసం మూడు టికెట్లను అడిగాడు. కానీ, ఇంగ్లిష్‌ క్రికెట్‌ అధికారులు దీనికి నిరాకరించారు. సాల్వే దీనిని అవమానంగా భావించారు. దీంతో 1987 కప్‌ భారత్‌లో నిర్వహించేలా ప్రధాని ఇందిరాగాంధీని ఒప్పించారు.  ప్రపంచకప్‌ టోర్నీలు ఇంగ్లాండ్‌ బయట నిర్వహించడం అదే తొలిసారి. 1984లో ఇందిర స్థానంలో రాజీవ్‌ వచ్చారు. ఆయన పారిశ్రామిక వేత్త అంబానీతో భారత్‌లో ప్రపంచకప్‌ నిర్వహణకు సాల్వేని ప్రోత్సహించారు. దీంతో 1987 రిలయన్స్ కప్‌కు భారత్‌ వేదికైంది. 


జోస్యం చెప్పి ఫలితం అనుభవించి..! 

డేవిడ్‌ ఫ్రిత్‌ వ్యాసాన్ని భారత అభిమానులు మర్చిపోలేదు. 1983లో కప్పు గెలిచాక.. మాన్‌ సింగ్‌ అనే ఎన్నారై  విజ్డన్‌ క్రికెట్‌కు ఓ లేఖ రాశారు. ఫ్రిత్ తన పదాలను తిని మాట నిలుపుకోవాలని కవ్వించాడు. గతంలో భారత్‌ను వెక్కిరిస్తూ రాసిన ఆర్టికల్‌ క్లిప్‌ కూడా ఆ లేఖకు జతచేశాడు. దీంతో ఫ్రిత్‌ ఆ కాగితాన్ని నోటితో తింటూ ఫొటో దిగి.. దానిని విజ్డన్‌లో మాన్‌సింగ్‌ లేఖతోపాటు ప్రచురించాడు.  కపిల్‌ డెవిల్స్‌ విజయంలో ఇలాంటి విశేషాలకు కొదవే లేదు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని