టీవీ అంపైర్.. ఇదెలా నాటౌట్‌?

అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు, విధానాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ‘అంపైర్స్‌ కాల్‌’, ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ వంటివి వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం వీటిపై పెదవి విరిచాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లు తాకినా సరే ఎల్బీడబ్ల్యూ...

Published : 24 Mar 2021 02:01 IST

(twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్ల నిర్ణయాలు, విధానాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ‘అంపైర్స్‌ కాల్‌’, ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ వంటివి వివాదాస్పదంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ సైతం వీటిపై పెదవి విరిచాడు. బాల్‌ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లు తాకినా సరే ఎల్బీడబ్ల్యూ ఇవ్వాలని సూచించాడు. అంపైర్ల నిర్ణయాలు తికమక పెడుతున్నాయని విమర్శించాడు. తాజాగా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ వన్డేలో అంపైర్‌ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

ఈ మ్యాచులో బంగ్లాదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (78; 108 బంతుల్లో 11×4) అర్ధశతకం చేశాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్‌ను జేమీసన్‌ వేశాడు. 34 పరుగులతో ఉన్న ఇక్బాల్‌ ఐదో బంతిని స్ట్రెయిట్‌గా ఆడాడు. దానిని 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బౌలర్‌ జేమీసన్‌ వంగి మరీ అందుకొని కిందపడ్డాడు. ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔట్‌గా ఇచ్చి మూడో అంపైర్‌కు నివేదించాడు. టీవీ అంపైర్‌ అన్ని కోణాల్లో తనిఖీ చేసి ‘బంతి నేలను తాకినట్టు కనిపిస్తోంది. ఆటగాడు సైతం పూర్తి నియంత్రణలో లేడు’ అని నాటౌట్‌గా ప్రకటించాడు.

నిజానికి జేమీసన్‌ బంతిని చక్కగా ఒడిసిపట్టాడు. అంతేకాకుండా అతడు పూర్తి నియంత్రణతో ఉన్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. అందుకే ఫీల్డ్‌ అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ను తిరస్కరించినందుకు విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యే ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచులోనూ సూర్యకుమార్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఫీల్డర్‌ నియంత్రణలో లేకున్నా, బంతి కింద తాకినట్టు కనిపించినా ఫీల్డ్‌ అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ ఔటిచ్చాడని మూడో అంపైర్‌ దానికే కట్టుబడ్డాడు. అంపైర్ల నిర్ణయాలు పరస్పరం విరుద్ధంగా ఉండటం గందరగోళం సృష్టిస్తోంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని