Virat Kohli: ఈ పిచ్‌లకు ‘పాత విరాట్‌’ సరిపోతాడు..: మంజ్రేకర్‌

విరాట్‌ పిచ్‌లను బట్టి తన బ్యాటింగ్‌ స్టైల్‌ను మార్చాలని మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో వలే ఆడటం ఇక్కడ సాధ్యం కాదని సూచించాడు.

Published : 12 Jun 2024 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా పిచ్‌లపై రాణించాలంటే విరాట్‌ దూకుడు కొంచెం తగ్గించుకోవాల్సిందేనని టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ సూచించాడు. అతడు ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. మరింత ఓపికతో ఆడితే అతడు పరుగుల వరద పారించగలడని విశ్వాసం వ్యక్తంచేశాడు. 

‘‘విరాట్‌ విషయంలో ఓ సమస్య ఉంది. గత రెండేళ్లుగా అతడి స్ట్రైక్‌ రేట్‌ అంశంపై విపరీతంగా చర్చ జరుగుతుంది. ఈసారి ఐపీఎల్‌ సీజన్‌లో దానిని అతడు పూర్తిగా మార్చేశాడు. 150 స్ట్రైక్‌ రేట్‌ను అందుకొన్నాడు. మరోవైపు ఇతరులది 200 దాటింది. ఇప్పుడా చర్చ అనవసరం. అతడు అదే మైండ్‌సెట్‌తో ఇప్పుడు ప్రపంచకప్‌నకు వచ్చినట్లు ఉన్నాడు. కానీ, ఇక్కడున్న పిచ్‌లకు మాత్రం ‘పాత కోహ్లీ’నే సరైన వ్యక్తి. అతడే మెరుగ్గా ఆడగలడు. ఎవరైనా పాత వెర్షన్‌ కోహ్లీని బయటకు తెమ్మని అతడికి చెప్పండి. ఫ్లాట్‌ పిచ్‌లు మళ్లీ ఎదురైనప్పుడు వెర్షన్‌ మార్చుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించాడు. నిన్న సంజయ్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూడా స్పందిస్తూ.. విరాట్‌ తదితరులకు మీడియా అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నాడు. వాస్తవానికి మ్యాచ్‌లను బుమ్రా ఒంటి చేత్తో గెలిపించేస్తున్నాడని వెల్లడించాడు. ఇప్పటికైతే టీమ్‌ ఇండియాలో అతడే అత్యుత్తమ ఆటగాడని అభినందించాడు.  

విరాట్‌ ఇటీవల ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్‌ను అందిపుచ్చుకొన్నాడు. ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన అతడు 154 స్ట్రైక్‌ రేటు, 61.75 సగటుతో 741 పరుగులు సాధించాడు. దీంతో అతడు ఈసారి ప్రపంచకప్‌లో కూడా పరుగుల వరదను పారించడం ఖాయమని భావించారు. కానీ, గత రెండు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శనతో విరాట్‌ స్వల్ప స్కోర్లతోనే వెనుదిరిగాడు. 

నస్సౌకౌంటీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు అమెరికా జట్టుతో భారత్‌ తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన యూఎస్‌ఏ జట్టు మంచి ఊపు మీదుంది. పాక్‌ వంటి బలమైన జట్టును అది సూపర్‌ ఓవర్‌లో ఓడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని