IND w Vs IRE w: ఐర్లాండ్‌పై విజయమే ముఖ్యం.. భారత్‌ సెమీస్‌ సమీకరణాలు ఇలా..!

మహిళల టీ20 ప్రపంచ కప్ (Womens t20 World cup 2023)లో భారత్‌ లీగ్‌ దశలో తన చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఐర్లాండ్‌పై గెలిస్తే నేరుగా టీమ్ఇండియా (INDw Vs IREw) సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడినా.. అవకాశాలు ఉన్నప్పటికీ.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

Published : 20 Feb 2023 14:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ (Womens T20 World Cup) లీగ్‌ స్టేజ్ తుది దశకు చేరింది. రెండు గ్రూప్‌ల్లోని ఎనిమిది జట్లలో సెమీస్‌ రేసు నుంచి దాదాపు రెండు జట్లు నిష్క్రమించాయి. గ్రూప్‌ - A నుంచి ఆసీస్‌, గ్రూప్‌ - B నుంచి ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఆరు జట్లు బరిలో ఉన్నాయి. ఆ రేసులో టీమ్‌ఇండియా (Team India) కూడా ఉంది. మరి భారత అవకాశాలు.. సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

వరుసగా రెండు విజయాలు సాధించిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో (INDw Vs ENGw) ఓటమిపాలైంది. చివరి వరకు పోరాడినప్పటికీ పరాజయం తప్పలేదు. దీంతో ఒక్కసారిగా భారత అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారిపోయాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ఉండే ఈపాటికే సెమీస్‌ బెర్తు ఖాయమైపోయేది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత్‌ తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే మూడు మ్యాచుల్లోనూ ఓడి సెమీస్‌ రేసు నుంచి వైదొలిగిన ఐర్లాండ్‌ను చిత్తు చేయడం భారత్‌కు పెద్ద కష్టమేం కాదు. కానీ, కీలక సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. 

రేణుకాకు తోడుగా...

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్‌ (5/15) మాత్రమే ఆకట్టుకొంది. టాప్‌ఆర్డర్‌తోపాటు కీలకమైన వికెట్లను తీసినప్పటికీ.. మిడిలార్డర్‌, లోయర్‌ఆర్డర్‌ను కట్టడి చేయడంలో మిగతా బౌలర్లు కాస్త వెనుకబడ్డారు. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ ఎక్కువగా పరుగులు సమర్పించారు. ఇక ఐర్లాండ్‌తో పోరులో (INDw Vs IREw) చివరి వరకు పట్టు సడలించకుండా ఉండాలి. ఇక బ్యాటింగ్‌లోనూ గత మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ, రోడ్రిగ్స్‌, హర్మన్‌ గాడిలో పడితేనే జట్టు సునాయాసంగా విజయం సాధిస్తుంది. స్మృతీ మంధాన తన ఫామ్‌ను కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు. 

సమీకరణాలు ఇలా..

  • ఐర్లాండ్‌ (0)తో టీమ్‌ఇండియా (4 పాయింట్లు) చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఇవాళ సాయంత్రం 6.30గంటలకు ఆడనుంది. ఇందులో విజయం సాధిస్తే ఇతర జట్ల సమీకరణాలతో అవసరం లేకుండానే సెమీస్‌ బెర్తు ఖాయమవుతుంది. అప్పుడు నాలుగు మ్యాచుల్లో ఆరు పాయింట్లతో సెమీస్‌కు వెళ్తుంది.
  • ఐర్లాండ్‌పై ఓడిపోతే మాత్రం.. వెస్టిండీస్‌ (4), పాకిస్థాన్‌ (2) జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. విండీస్‌కు ఇప్పటికే నాలుగు మ్యాచులను ఆడేసింది. ప్రస్తుతం 4 పాయింట్లతో కొనసాగుతోంది. రన్‌రేట్‌ మాత్రం భారత్‌ కంటే తక్కువే ఉంది. భారత్‌ భారీ తేడాతో ఓడితేనే ఆ జట్టుకు ఏమైనా అవకాశం ఉంటుంది. అదీనూ పాక్‌ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.
  • పాక్‌కు ఒక్క మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్‌తోనే తలపడాల్సి ఉంది. గత మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడింది. దగ్గరగా వచ్చి మరీ ఓడిపోయింది. దీంతో తన చివరి మ్యాచ్‌లో గెలిస్తే మాత్రం భారత్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా సెమీస్‌కు వెళ్లేందుకు పాక్‌కు అవకాశాలు మెండుగా ఉంటాయి. 
  • ఇలాంటి సమీకరణాలతో పనిలేకుండా ఉండాలంటే.. ఐర్లాండ్‌పై టీమ్‌ఇండియా గెలిస్తే సరిపోతుంది. అప్పుడు విండీస్‌, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌ ఇంటిముఖం పట్టడం ఖాయం. అప్పుడు గ్రూప్‌ - ఏలోని టాప్‌ జట్టుతో సెమీస్‌లో తలపడాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు