Hyderabad: హైదరాబాద్‌ విజయాల జోరు కొనసాగించేనా?.. కోల్‌కతాతో మరో కీలక పోరు

మెగా టీ20 లీగ్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఘోరంగా ఆరంభించినా చివరి రెండు మ్యాచ్‌లు గెలవడంతో జట్టులో కొత్త జోష్‌ నెలకొంది. ఇకపై ఇలాగే వరుసపెట్టి విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు...

Updated : 14 Apr 2022 19:13 IST

మెగా టీ20 లీగ్‌ టోర్నీలో హైదరాబాద్‌ ఘోరంగా ఆరంభించినా చివరి రెండు మ్యాచ్‌లు గెలవడంతో జట్టులో కొత్త జోష్‌ నెలకొంది. ఇకపై ఇలాగే వరుసపెట్టి విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు కోల్‌కతా గత మ్యాచ్‌లో దిల్లీతో ఓటమిపాలైంది. అంతకుముందు మూడు విజయాలు, ఒక ఓటమి చవిచూసింది. ఈ రెండు జట్లూ శుక్రవారం కీలక పోరులో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి. హైదరాబాద్‌ విజయం సాధించాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం..

రెండు అలా.. రెండు ఇలా..

హైదరాబాద్‌ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడింది రాజస్థాన్‌ జట్టుతో. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్‌ ఒక్క ఓటమి మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 210 పరుగులు సాధించి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, విలియమ్సన్‌ టీమ్‌ 149 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. అనంతరం లఖ్‌నవూతో తలపడిన రెండో మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 157 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఆపై మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నైని 154 పరుగులకు కట్టడి చేసి తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి సునాయాస విజయం సాధించింది. చివరికి వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్‌ను 162 పరుగులకే నిలువరించి ఛేదనలో రెండు వికెట్లే కోల్పోయి ఘన విజయం నమోదు చేసింది. దీన్నిబట్టి గతరెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా మెరుగైందిగా కనిపిస్తోంది.

కోల్‌కతా పుంజుకునేనా?

ఇక కోల్‌కతా ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు ఓటములు, మూడు విజయాలతో కొనసాగుతోంది. బౌలింగ్ పరంగా అద్భుతంగా ఉన్న ఆ జట్టు దిల్లీతో ఆడిన గతమ్యాచ్‌లోనే గాడి తప్పింది. తొలుత చెన్నైతో ఆడిన మ్యాచ్‌లో 131/5 పరుగులకే కట్టడి చేసి డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు గట్టి షాకిచ్చింది. ఆపై నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదింది. అనంతరం బెంగళూరుతో ఆడిన రెండో మ్యాచ్‌లో 128 పరుగులకే ఆలౌటైంది. బెంగళూరు ఆ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఆపై పంజాబ్‌ను మూడో మ్యాచ్‌లో 137 పరుగులకే కట్టడి చేసింది. దాన్ని విజయవంతంగా ఛేదించింది. తర్వాత ముంబయిని కూడా 161/4 మోస్తరు స్కోరుకే పరిమితం చేసి విజయం సాధించింది. కాగా, గత మ్యాచ్‌లో దిల్లీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో కోల్‌కతాకు షాకిచ్చింది. 215/5 స్కోర్‌ సాధించి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా అంతమొత్తం పరుగులు చేయలేక 171 పరుగులు చేసింది. దీంతో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు బౌలింగ్‌ బలంగా ఉన్నా గతమ్యాచ్‌లోనే పూర్తిగా తేలిపోయినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్‌ పరంగా మోస్తరు స్కోర్‌ సాధించే సత్తా ఉంది.

హైదరాబాద్‌ గెలవాలంటే?

ఇక కోల్‌కతాతో ఆడే తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం సాధించాలంటే కొన్ని విషయాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇప్పటివరకూ కోల్‌కతా అత్యధిక స్కోర్‌ 171. అలాగే హైదరాబాద్‌ టీమ్‌ అత్యధిక స్కోర్‌ 168/2. అంటే.. బ్యాటింగ్‌ పరంగా రెండు జట్లూ అటు ఇటు సమానంగానే ఉన్నాయి. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థులను మోస్తరు స్కోర్లలోపు కట్టడి చేస్తే విజయాలు సాధించాయి. దీన్ని బట్టి.. తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలవాలంటే కోల్‌కతాను సుమారు 150 లేదా 160 స్కోర్‌లోపు కట్టడి చేయాలి. లేదా తొలుత బ్యాటింగ్‌ చేస్తే సుమారు 200 పరుగులు చెయ్యాలి. ఇలా చేస్తే తప్ప హైదరాబాద్‌ వరుసగా తన ఖాతాలో మూడో విజయాన్ని నమోదు చేయలేదు.

వీళ్లే కీలక ఆటగాళ్లు..

(Photo: Abhishek Sharma Instagram)

హైదరాబాద్‌ జట్టులో కీలక ఆటగాళ్లంటే ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌. వీరిద్దరూ గత రెండు మ్యాచ్‌ల్లో బాగా ఆడారు. తర్వాత రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌ సైతం నెమ్మదిగా రాణిస్తున్నారు. దీంతో ఈ టాప్‌ ఆర్డర్‌ మొత్తం రాణిస్తే కోల్‌కతాపై ఆధిపత్యం చెలాయించడం పెద్ద కష్టమేం కాదు. మరోవైపు బౌలింగ్‌లో నటరాజన్‌ మెరుస్తున్నా.. భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ మరింతగా చెలరేగాలి. వీరిద్దరూ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నా ప్రత్యర్థుల వికెట్లు పడగొట్టాలి. ఇలా వీరంతా సమష్టిగా రాణిస్తే కోల్‌కతాను కూడా ఓడించొచ్చు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని