Neeraj Chopra: పతక విజేత నీరజ్‌ చోప్రాకు ఏమేం ఇస్తున్నారంటే..!

శతాబ్దం తర్వాత అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం సాధించిన వీరుడిగా నిలిచాడు నీరజ్‌ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో గతంలో అనేక అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచినప్పుడు రాని ప్రశంసలు.. నగదు బహుమతులు

Published : 10 Aug 2021 23:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో శతాబ్దం తర్వాత భారత్‌కు పతకం సాధించి పెట్టిన వీరుడిగా నిలిచాడు నీరజ్‌ చోప్రా. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో గతంలో అనేక అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు గెలిచినప్పుడు రాని ప్రశంసలు.. నగదు బహుమతులు ఇప్పుడు అతడిపై వర్షంలా కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన మార్కెట్‌ విలువ కూడా బాగా పెరిగింది. 

ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ చోప్రాకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు, వివిధ సంస్థలు భారీగా నగదు బహుమతి ప్రకటించాయి. స్వర్ణం గెలిచిన నీరజ్‌కు కేంద్రం పాలసీ ప్రకారం రూ.75లక్షలు అందనుంది. ఇక అతడి స్వరాష్ట్రం హరియాణాలో అక్కడి ప్రభుత్వం రూ. ఆరు కోట్లు ఇస్తామని వెల్లడించింది. పొరుగు రాష్ట్రం పంజాబ్‌ రూ. 2కోట్లు, మణిపూర్‌ రూ. కోటి నగదు బహుమతి ప్రకటించాయి. బైజూ సంస్థ రూ. 2కోట్లు.. బీసీసీఐ రూ. కోటి, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. కోటి ఇవ్వనన్నట్లు వెల్లడించాయి. ఇప్పటి వరకు మొత్తంగా రూ. 13 కోట్లు నగదు బహుమతిగా పొందనున్నాడు నీరజ్‌. అంతేకాదు.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా తమ కంపెనీ తయారు చేస్తోన్న ఎక్స్‌యూవీ 700 మోడల్‌ కారును బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇండిగో సంస్థ నీరజ్‌కు ఏడాదిపాటు ఉచిత విమానప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. 

మార్కెట్లు విలువ వెయ్యి రెట్లు పెరిగిందోచ్‌..

నీరజ్‌ చోప్రా ప్రచార వ్యవహారాలను జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లోని స్పోర్ట్స్‌ విభాగం చూసుకుంటుంది. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన స్పోర్ట్స్‌ ప్రోగ్రామ్‌లో నీరజ్‌ సభ్యుడిగా చేరి.. జావెలిన్‌ త్రోలో శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే జిల్లెట్‌, ఎక్సాన్‌ మొబైల్‌, మజిల్‌ బ్లేజ్‌ వంటి ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఒలింపిక్స్‌లో పతకం గెలవడంతో నీరజ్‌తో తమ బ్రాండ్‌ ఉత్పత్తులను ప్రచారం చేయించాలని అనేక సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయట. ఇప్పటికే పలు కంపెనీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ ప్రతినిధి ముస్తఫా గౌస్‌ వెల్లడించారు. ఒలింపిక్స్‌ ముందు వరకు ప్రచారకర్తగా ఉన్నందుకు నీరజ్‌ చోప్రా పారితోషికం ఏడాదికి రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు ఉండేదని.. ఇప్పుడు కనీసం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పారు. వివిధ సంస్థలు నీరజ్‌కు ఏడాదికి రూ.2.5కోట్లకుపైగా పారితోషికం ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయని గౌస్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని