Washington: ఎప్పుడైనా సరే బ్యాటింగ్‌కు సిద్ధం.. పవర్‌ హిట్టింగ్‌పై దృష్టిపెట్టా: వాషింగ్టన్ సుందర్

రవీంద్ర జడేజాలా దూకుడుగా బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. కుడి చేతి వాటం స్పిన్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టగలడు. వచ్చే వరల్డ్‌కప్‌ ఆడే జట్టులో తప్పకుండా స్థానం సంపాదిస్తానని, అందుకోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేలా కృషి చేస్తున్నట్లు వాషింగ్టన్ సుందర్‌ పేర్కొన్నాడు.

Published : 09 Dec 2022 20:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రైట్‌ ఆర్మ్‌ స్పిన్‌తోపాటు లెఫ్ట్‌ఆర్మ్ బ్యాటర్‌గా వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇటీవల న్యూజిలాండ్‌ మీద కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు రాబట్టి ఔరా అనిపించాడు. దీంతో టాప్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా లేని లోటును తీరుస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత భారత టీ20 లీగ్‌లోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజస్థాన్‌పై 14 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. తాజాగా మూడో వన్డే కోసం సిద్ధమవుతున్న వాషింగ్టన్ సుందర్‌ మీడియాతో మాట్లాడాడు. 

‘‘జట్టు కోసం ఎలాంటి స్థానంలోనైనా బ్యాటింగ్‌కు వస్తా. దాని కోసం నిరంతరం సన్నద్ధంగా ఉంటా. అందుకోసం ప్రత్యేకంగా దృష్టిసారించా. గత కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కుతోంది. వచ్చేకాలంలోనూ ఇదే విధంగా ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. రెండో వన్డేలో నాలుగో స్థానంలో రావడం మంచి అవకాశం దక్కినట్లే. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ జరగనుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే ప్లేయర్ల జాబితాలో ఉండేందుకు ఇష్టపడతా. మేనేజ్‌మెంట్‌ కోరుకున్న విధంగా ఏ స్థానంలోనైనా ఆడతా’’

‘‘నా శక్తిసామర్థ్యాలను పూర్తి వినియోగించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తా. నేను బాగా ఆడినప్పుడు చాలా మ్యాచుల్లో జట్టు విజయాలు సాధించింది. ఇక బంగ్లాతో రెండు వన్డేల్లోనూ అవకాశాలు వచ్చినా మేం అందుకోలేక ఓడిపోయాం. తొలి వన్డేలో అయితే 50 పరుగులు ఉన్నా.. వికెట్‌ తీయలేకపోయాం. రెండో మ్యాచ్‌లో 70 పరుగులకే ఆరు వికెట్లు తీసినా అదే ఊపు కొనసాగించలేకపోయాం. శ్రేయస్-అక్షర్ పటేల్ భాగస్వామ్యం ఉన్నప్పుడు గెలుస్తామని భావించా. చివరి వరకు అద్భుతంగా పోరాడిన రోహిత్‌ ప్రదర్శన అసాధారణం. స్వదేశంలో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టడం సులువేం కాదు. ఆటగాళ్లు గాయపడటం కూడా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే వాటన్నింటిని అధిగమించి చివరి వన్డేలో విజయం సాధిస్తాం. రాహుల్ ద్రవిడ్‌ చాలా అనుభవం కలిగిన వ్యక్తి. వన్డే ఫార్మాట్‌లో ఎన్నో అద్భుతాలు సాధించాడు. ఎలాంటి సందేహం ఉన్నా అతడితో మాట్లాడితే పరిష్కారం చూపిస్తాడు’’ అని వాషింగ్టన్ సుందర్ వెల్లడించాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని