Updated : 09 Jan 2021 06:17 IST

మరిచిపోలేని జ్ఞాపకమిది: జడేజా

ఇంటర్నెట్‌డెస్క్: తాను ఎంతో విలువైన ప్లేయర్‌నని టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మరోసారి నిరూపించాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బౌలర్‌గా నాలుగు వికెట్లు పడగొట్టడమే కాకుండా, అత్యుత్తమ ఫీల్డర్‌గా స్టీవ్‌ స్మిత్‌ (131)ను రనౌట్‌ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తన కెరీర్‌లో స్మిత్‌ రనౌట్‌ను ఎప్పటికీ మరవలేనని తెలిపాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం జడ్డూ తన ప్రదర్శన గురించి వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

‘‘30 యార్డ్స్‌ సర్కిల్ అవతల నుంచి నేరుగా వికెట్లకు బంతిని విసరడం ఎంతో సంతృప్తినిచ్చింది. అత్యుత్తమ ప్రయత్నంతో చేసిన రనౌట్‌ ఇది. నాలుగు వికెట్లు తీయడం గొప్పగా ఉంది. కానీ ఈ రనౌట్‌ మరిచిపోలేని జ్ఞాపకం. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ప్రతి ఓవర్‌లో ఔట్ చేసే అవకాశాలు వచ్చే పిచ్‌ ఇది కాదు. అందుకే బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నించా. అన్ని బంతులు ఒకే వేగంతో కాకుండా, వైవిధ్యం ప్రదర్శిస్తూ బౌలింగ్ చేశాను’’ అని జడేజా అన్నాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో జడ్డూ బ్యాటు, బంతితో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై జడేజా మాట్లాడుతూ..‘‘గత 12-18 నెలల నుంచే కాదు, అరంగేట్రం నుంచి నా పాత్ర ఇదే. బరిలోకి దిగిన తర్వాత బ్యాటు, బంతితో రాణించాలని ప్రయత్నిస్తా. విదేశాల్లో నా బ్యాటింగ్ ప్రదర్శన గొప్పగా ఉంటుందని అంటుంటారు. అయితే వాటి గురించి నేను ఆలోచించను. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనే భావిస్తా’’ అని పేర్కొన్నాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని జడేజా తెలిపాడు. అలా వెళ్తే.. క్రీజులో కుదురుకోవడానికి, మ్యాచ్‌ పరిస్థితులను బట్టి ప్రణాళికను అమలుపరచడానికి సమయం ఉంటుందని అన్నాడు. మరి, ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు...‘ఓపెనింగ్ చేయమంటారా?’ అని జడ్డూ సరదాగా సమాధానమిచ్చాడు. అర్ధశతకం బాదిన యువఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50)ను జడేజా కొనియాడాడు. గిల్‌కు గొప్ప కెరీర్‌ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే టీమిండియా ఇంకా 242 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇదీ చదవండి

రెండో రోజు మెరిసిన భారత్‌

జడ్డూ నాలుగు కాదు.. అయిదు వికెట్లు


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని