Virender Sehwag: టీమ్‌ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్‌

టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్‌పై భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు కోచ్‌గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు.

Published : 21 Mar 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కోచ్‌గా వ్యవహరించాలని తనకు వచ్చిన ఆఫర్‌పై డ్యాషింగ్‌ ఓపెనర్‌, భారత క్రికెట్‌ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) సంచలన వ్యాఖ్యలు చేశాడు. అనిల్‌కుంబ్లే(Anil Kumble) అనంతరం టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ఉండాలని తనను అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి కోరినట్లు తెలిపాడు. అయితే తర్వాత తనకు కోచ్‌గా ఎందుకు అవకాశం రాలేదో కారణాలు వివరించాడు. వారు తనని కలవకపోయుంటే తాను కోచ్‌ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదన్నాడు. కోహ్లీకి, కుంబ్లేకి మధ్య సక్యత కుదరకపోవడంతో వారు తనని కలిసి కోచ్‌ పోస్టుకు దరఖాస్తు చేయమని కోరినట్లు వీరూ వెల్లడించాడు.  

ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో మాట్లాడిన సెహ్వాగ్‌.. పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ‘‘విరాట్‌కోహ్లీ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఒకవేళ నన్ను కలవకపోయుంటే నేను టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ పోస్టుకు దరఖాస్తు చేసేవాడిని కాదు. మా మధ్య సమావేశం జరిగింది. విరాట్‌కోహ్లీ, అనిల్‌కుంబ్లే మధ్య సక్యత కుదరట్లేదని అందువల్ల మీరు కోచ్‌ స్థానాన్ని తీసుకోవాలని అమితాబ్‌ నన్ను కోరాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం కోచ్‌గా కుంబ్లే గడువు ముగుస్తుందని తెలిపాడు. దాని తర్వాత మీరు జట్టుతో వెస్టిండీస్‌లో పర్యటించాల్సి ఉంటుందన్నాడు. నేను నా నిర్ణయాన్ని తెలియజేయలేదు కానీ,  వెస్టిండీస్‌కి వెళ్లాలంటే నాకు సహాయక శిక్షణ బృందం కావాలని అడిగాను. సహాయక శిక్షకుడు, బౌలింగ్, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ కావాలన్నాను. సహాయక సిబ్బందిని నేనే ఎంపికచేయాలన్నాను. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. దాంతో నేను వెస్టిండీస్‌కి వెళ్లలేదు’’ అని  వివరించాడు. కుంబ్లే అనంతరం రవిశాస్త్రి టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని