Inzamam Ul Haq: నాకు గుండెపోటు రాలేదు: ఇంజమామ్‌ ఉల్‌ హక్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ గుండెపోటుకు గురయ్యారంటూ నిన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంజమామ్‌ తాజాగా ఖండించారు.

Published : 30 Sep 2021 01:25 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ గుండెపోటుకు గురయ్యారంటూ నిన్న వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఇంజమామ్‌ తాజాగా ఖండించారు. తనకు ఎలాంటి గుండెపోటు రాలేదని తెలిపారు. అయితే కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే గుండెలో సమస్య బయటపడిందని చెప్పారు. దానికి చికిత్స తీసుకున్నానని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో బుధవారం ఓ వీడియో విడుదల చేశారు.

అనారోగ్య సమస్యలతో ఇంజమామ్‌ సోమవారం రాత్రి లాహోర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై నేడు ఇంజమామ్‌ స్పందించారు. ‘‘నాకు గుండెపోటు వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. కడుపులో ఇబ్బంది తలెత్తడంతో డాక్టర్‌ వద్దకు వెళ్లాను. అక్కడ నాకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎందుకైనా మంచిదని యాంజియోగ్రఫీ కూడా చేశారు. ఆ సమయంలో నా రక్త నాళాల్లో ఒకటి కొంత మూసుకుపోయినట్లు గుర్తించారు. దీంతో స్టంట్‌ వేశారు. అది విజయవంతమైంది. 12 గంటల తర్వాత నేను ఇంటికి వెళ్లిపోయాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను’’ అని ఇంజమామ్‌ వివరించారు. తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించిన అభిమానులు, ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇంజమామ్‌ పాకిస్థాన్‌ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సేవలందించారు. పాక్‌ తరఫున 120 టెస్టులు, 378 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 1992 వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన పాక్‌ జట్టులోనూ సభ్యుడిగా ఉన్నారు. తర్వాత కీలక ఆటగాడిగా మారి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. 2001 నుంచి 2007 వరకు పాక్ జట్టు సారథిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని