ప్రసిద్ధ్‌ గురించి ముందే అనుకున్నా: రాహుల్‌

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు...

Published : 26 Mar 2021 10:36 IST

పుణె: ఇంగ్లాండ్‌తో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ప్రసిద్ధ్‌ ప్రదర్శన తనకెలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు. తన రాష్ట్రమే అయిన కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ్‌ ప్రతిభ గురించి తనకు బాగా తెలుసని అతనన్నాడు. ‘‘నిజంగా చెప్పాలంటే తన అరంగేట్ర మ్యాచ్‌లో ప్రసిద్ధ్‌ ప్రదర్శన నాకెలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కర్ణాటక నుంచి మరో ఆటగాడు జాతీయ జట్టులోకి వస్తే అది కచ్చితంగా ప్రసిద్ధ్‌యే అనే నమ్మకంతో ఉండేవాణ్ని. మేం ఒకటే వయసు విభాగం కాదు కానీ జూనియర్‌ క్రికెట్లో, నెట్స్‌లో అతని బౌలింగ్‌ చూశా. తన ఆటతో అతను మన కళ్లని తిప్పుకోగలడు. పొడుగ్గా ఉన్న అతను వేగంగా బంతులేస్తాడు. బౌన్స్‌ రాబడతాడు. అతనితో గత కొన్ని సీజన్లుగా దేశవాళీల్లో ఆడిన అనుభవంతో చెప్తున్న అతనెంతో ధైర్యవంతుడైన కుర్రాడు. దూకుడు ప్రదర్శిస్తాడు’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

‘‘అలాగే గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌కు అతను మాటలు విసిరేందుకు ప్రయత్నించడాన్ని చూశాం. తన ఆరంభ ఓవర్లలో పరుగులు ఇచ్చినప్పటికీ తిరిగి పుంజుకున్న అతను కీలక వికెట్లు పడగొట్టిన విధానం ఆకట్టుకుంది. ఐపీఎల్, దేశవాళీ అనుభవంతో అరంగేట్ర మ్యాచ్‌ల్లోనే కుర్రాళ్లు అదరగొడుతున్నారు. సూర్యకుమార్, ఇషాన్, కృనాల్, ప్రసిద్ధ్‌ అందుకు నిదర్శనం’’ అని రాహుల్‌ తెలిపాడు. ఇక మూడు నెలలుగా మ్యాచ్‌లు ఆడకపోవడంతో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించలేకపోయానని అతను చెప్పాడు. తొలి వన్డేలో అజేయ అర్ధశతకంతో రాహుల్‌ తిరిగి ఫామ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ‘‘ఓ బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఉండి, మ్యాచ్‌లు ఆడుతుంటేనే మంచి ఫామ్‌లో ఉంటాం. గత మూడు నెలలుగా అనుకున్నన్ని మ్యాచ్‌లు ఆడకపోవడంతో ఇంగ్లాండ్‌తో టీ20ల్లో పరుగులు చేయలేకపోయా. అది నా మెదడులో తిరగట్లేదని చెప్పలేను. మంచి సన్నాహకం ఉండాలి కదా. అది శిక్షణ కావొచ్చు లేదా నెట్స్‌లో ప్రాక్టీస్‌ కావొచ్చు. జట్టులో ఉండాలంటే తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సిందే. ఎంతో మంది ప్రతిభావంతులైన కుర్రాళ్లు జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. నా సన్నద్ధతలో ఏదైనా లోపముందా అని నన్ను నేను ప్రశ్నించుకుని తిరిగి వన్డే సిరీస్‌కు మెరుగ్గా సిద్ధమయ్యా’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు