Ganguly : నా పని నేను చేశాను.. నిరాధార వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు : గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడిగా తన పని తాను చేసుకుపోయానని, తనపై వచ్చే నిరాధార వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో..

Published : 04 Feb 2022 21:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : బీసీసీఐ అధ్యక్షుడిగా తన పని తాను చేసుకుపోయానని, తనపై వచ్చే నిరాధార వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.  

* సెలెక్షన్‌ కమిటీని ప్రభావితం చేస్తున్నారని, బీసీసీఐ సమావేశాల్లో సెలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారనే వార్తలు వాస్తవమేనా?

ఇలాంటి నిరాధార వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బీసీసీఐ  అధ్యక్షుడిగా నా పని నేను చేసుకుపోయాను. సెక్రెటరీ జై షా, జాయింట్ సెక్రెటరీ జయేశ్ జార్జ్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలతో కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నేను కూడా చూశాను. అది సెలెక్షన్‌ కమిటీ సమావేశంలో తీసిన ఫొటో కాదు. జయేశ్ జార్జ్‌ సెలెక్షన్‌ కమిటీ మెంబర్‌ కాదు. బీసీసీఐ అధ్యక్షుడు కాక ముందు నేను కూడా భారత జట్టు తరఫున 424 అంతర్జాతీయ మ్యాచులు ఆడాను. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.

* సుదీర్ఘ కాలంగా సెక్రెటరీ జై షాతో కలిసి పని చేస్తున్నారు. అతడితో ప్రయాణం ఎలా అనిపిస్తోంది?

జై మంచి స్నేహితుడు. నమ్మకస్తుడు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కూడా నేను, జై, అరుణ్‌ ధూమల్, జయేశ్‌ జార్జ్‌ భారత క్రికెట్‌ కోసం కష్టపడి పని చేస్తున్నాం.

* టీమ్‌ఇండియా తర్వాతి టెస్టు కెప్టెన్ ఎవరు?

టీమ్‌ఇండియా భవిష్యత్ దృష్ట్యా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని టెస్టు కెప్టెన్‌ని ఎంపిక చేస్తాం. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై సెలెక్టర్లు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చి ఉంటారు. వాళ్లతో చర్చించాక.. సరైన సమయంలో పేరు వెల్లడిస్తాం.

* మునుపటి ఫామ్‌ను అందుకోవడానికి రహానె, పుజారాలు రంజీ మ్యాచులు ఆడాలని చెప్పారు. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు వాళ్లిద్దరినీ పక్కన పెట్టినట్లేనా?

ఫిబ్రవరి మూడో వారంలో రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ మార్చిలో జరుగుతుంది. అప్పటి వరకు వాళ్లిద్దరూ రంజీ ట్రోఫీ ఆడితే మంచి ప్రాక్టీస్‌ దొరికినట్లవుతుంది. మునుపటి ఫామ్‌ అందుకుంటారని భావించాను. అందుకే అలా చెప్పాను. ఏదేమైనా సెలెక్షన్‌ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వాళ్లు ఏం చెబితే అదే చేస్తాం.

* భారత జట్టులో ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య లేని లోటును భర్తీ చేసేందుకు ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? 

గాయం కారణంగా హార్దిక్‌ను కొంతకాలం జట్టుకు దూరం పెట్టాం. పూర్తిగా కోలుకుంటే.. మరింత ఎక్కువకాలం టీమ్‌ఇండియాకు సేవలందించగలడు. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో మళ్లీ మునుపటి హార్దిక్‌ను చూస్తామనుకుంటున్నాను. అతడి ఫామ్‌, ఫిట్‌నెస్‌ను బట్టి సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. 

* పూర్తి స్థాయి విమెన్స్‌ ఐపీఎల్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? 

పూర్తిస్థాయి విమెన్స్‌ ఐపీఎల్‌ నిర్వహించాలనే ఆలోచన మాకు కూడా ఉంది. కచ్చితంగా త్వరలోనే అది నెరవేరుతుంది. 2023 నుంచి పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలనుకుంటున్నాం. మెన్స్‌ ఐపీఎల్ లాగానే.. ఇది కూడా విజయవంతమవుతుంది.

* పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం 75 శాతం ఆక్యుపెన్సీతో టీ20 మ్యాచులు నిర్వహించేందుకు అనుమతించింది. మరీ వన్డే సిరీస్‌ను ఎందుకు ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు?

ఈడెన్‌ గార్డెన్‌లో జరుగనున్న టీ20 సిరీస్‌కు సాధారణ ప్రేక్షకులను అనుమతించం. ప్రస్తుత కరోనా సమయంలో ఆటగాళ్ల ప్రాణాలను పణంగా పెట్టలేం. సిరీస్‌కు ఆతిథ్యమిస్తున్న బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధికారులతో పాటు, మరి కొంత మంది ముఖ్య ప్రతినిధులకు మాత్రమే అనుమతిస్తాం.

* ఎట్టకేలకు రంజీ ట్రోఫీని రెండు విడతల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. మ్యాచ్‌ ఫీజును రూ. 2.4 లక్షల వరకు పెంచిన తర్వాత కూడా చాలా జట్లు మూడు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచులు మాత్రమే ఆడనున్నాయి. ఇది వాటాదారులకు ఆర్థికంగా భారం కాదా?

విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలకు కూడా మ్యాచ్‌ ఫీజులను పెంచాం. కరోనా పరిస్థితుల దృష్ట్యా మెడికల్ సిబ్బందితో చర్చించాక.. నాలుగు జట్లను కలిపి ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేశాం. ఆటగాళ్లను బయో బబుల్‌లో ఉంచుతూ మ్యాచులు నిర్వహించేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. ఒకే చోట ఎక్కువ మంది ఆటగాళ్లను ఉంచితే కరోనా బారిన పడే అవకాశం ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే చాలా టోర్నీల షెడ్యూల్‌ను మార్చాం. చాలా మంది ఫస్ట్‌ క్లాస్‌ ఆటగాళ్లు ఇప్పటికే ఐపీఎల్‌లో ఆడుతున్నారు. కాబట్టి, ఐపీఎల్, మహిళల టీ20 సిరీస్‌ నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని