
Ravi Shastri : రవిశాస్త్రి వ్యాఖ్యలు.. భారత క్రికెట్‌కు మంచిది కాదు : సంజయ్ మంజ్రేకర్
ఇంటర్నెట్ డెస్క్ : ‘విరాట్ కోహ్లీ కచ్చితంగా మరో రెండేళ్ల పాటు భారత జట్టును నడిపించేవాడు. ఎందుకంటే, రాబోయే రెండేళ్లలో భారత్ ఆడనున్న సిరీస్‌లన్నీ స్వదేశంలో ఆడేవే. అవి కూడా టెస్టు ర్యాంకింగ్స్‌లో అట్టడుగు స్థానాల్లో ఉన్న జట్లతో.. అందుకే అతడిని మరికొంత కాలం కెప్టెన్‌గా కొనసాగించాల్సింది. అలా జరిగి ఉంటే అతడి నాయకత్వంలో కచ్చితంగా 50-60 విజయాలు నమోదు చేసేవాడు. టెస్టుల్లో కోహ్లీ సాధించిన ఘనతలను చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అందుకే అతడిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీని వదులుకునేలా చేశారు’ అని టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. రవిశాస్త్రి లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నాడు.
‘రవిశాస్త్రిని విమర్శించాలనే ఆలోచన నాకు లేదు. అతడి సారథ్యంలో నేను కూడా ఆడాను. అతడికి పెద్ద అభిమానిని. కెప్టెన్‌గా అతడెప్పుడూ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచేవాడు. కానీ, శాస్త్రి 2.0 వెర్షన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. నేను అతడిని కించపరచాలనుకోవడం లేదు. కానీ, అతనెప్పుడు తెలివైన వ్యాఖ్యలు చేయడు. శాస్త్రి వ్యాఖ్యల వెనుక మర్మమేంటో మనం అర్థం చేసుకోగలం. ఇలాంటివి భారత క్రికెట్‌కు అంత మంచిది కాదు’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. కోహ్లీ సారథ్యంలో 68 టెస్టులు ఆడిన టీమ్ఇండియా.. 40 మ్యాచుల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం.. కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికిన విషయం తెలిసిందే.