ఆసియా కప్‌ 2023 కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌ వెళ్లకూడదు: హర్భజన్‌ సింగ్‌

భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ ఆసియాకప్‌ 2023, ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించకూడదన్నాడు.

Published : 17 Mar 2023 16:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌(Asia Cup) 2023 కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించకూడదని భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అక్కడ ఎదురయ్యే ప్రమాదాలను పరిగణించాల్సి ఉంటుందన్నాడు. ఓ ప్రైవేటు చానల్‌తో మాట్లాడిన అతడు..‘‘టీమ్‌ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించకూడదు. అక్కడి ప్రజలే సురక్షితంగా లేనప్పుడు మనం ఎందుకు రిస్క్‌ తీసుకోవాలి..? ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఏ సిరీస్‌ కోసం అక్కడకు వెళ్లకూడదని నిర్ణయించి ప్రభుత్వం సరైన నిర్ణయిం తీసుకొంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) గురించి మాట్లాడుతూ.. ఈసారి భారత్‌ కచ్చితంగా టైటిల్‌ నెగ్గుతుందని భజ్జీ ధీమా వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్‌ అర్హత సాధించడం ఇది వరుసగా రెండోసారి. రెండేళ్ల క్రితం ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో తలపడి ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ‘‘టీమ్‌ఇండియా ఏ పిచ్‌పై ఆడుతున్నా ప్రతిసారి విజయం సాధించాలనే కోరుకుంటాం. ఈసారి కూడా గెలవాలనే ఆశిస్తున్నాం. ఇటీవలే విరాట్‌ కోహ్లీ టెస్టు సెంచరీ సాధించాడు. అతడు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇది మనకు సదవకాశం. ఒకవేళ భారత్‌ 400 పరుగులు సాధిస్తే.. మ్యాచ్‌ను గెలవడానికి, వికెట్లు సాధించడానికి మన బౌలర్లు ఉండనే ఉన్నారు.  ఈ మ్యాచ్‌కు పేసర్‌ బుమ్రా అందుబాటులో ఉండడు. మహమ్మద్‌ షమీ, సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌ ఉన్నారు. దీపక్‌ చాహర్‌ కూడా ఇంగ్లాండ్‌లో బాగా ఆడాడు. బుమ్రా స్థానంలో షమీకి అవకాశం లభించవచ్చు. ఇక మూడో బౌలర్‌ను వెతకాలి. ఉమేశ్‌ యాదవ్‌ కూడా ఉన్నాడు. కాబట్టి ఫైనల్‌కు మంచి బౌలింగ్‌ దళం అందుబాటులో ఉంటుంది. స్పిన్నర్లు జడేజా, అశ్విన్ ఇప్పటి వరకు నాణ్యమైన క్రికెట్‌ ఆడారు. వారిలో ఒకరు ఫైనల్‌ ఆడే అవకాశం ఉంది’’ అని వివరించాడు.

బాబర్ అజామ్‌ వ్యాఖ్యలపై హర్భజన్‌ స్పందన

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్‌ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటగాళ్ల భాగస్వామ్యం, ఆదరణ, రెవెన్యూ ఏ రకంగా చూసినా ఐపీఎల్‌కు అత్యంత ప్రాధాన్యం ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ఎస్‌ఏ20 లీగ్‌ వంటి ఇతర లీగ్‌లు ఎన్ని ఉన్నా ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ను ఐపీఎల్‌, బీబీఎల్‌లో మీకు నచ్చిన లీగ్‌ ఏంటి అని అడగగా అతడు బీబీఎల్‌ను ఎంచుకున్నాడు. ‘‘ఆస్ట్రేలియాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడి పిచ్‌లపై వేగంగా ఆడొచ్చు. అక్కడ చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఐపీఎల్‌ విషయానికి వస్తే ఆసియాను తలపించే పరిస్థితులే అక్కడ ఉంటాయి’’ అని సమాధానమిచ్చాడు బాబర్‌. దీనిపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్ సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజీని పంచుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని