కోహ్లీతో ఆడాలని కలగన్నా: సూర్యకుమార్‌

టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ నాయకత్వంలో ఆడాలని సుదీర్ఘకాలంగా తాను కలగన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటున్నాడు. విరాట్‌ను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు హార్దిక్‌ను అడిగి విరాట్‌ గురించి తెలుసుకొనేవాడినని...

Published : 26 Feb 2021 23:25 IST

(PIC: BCCI)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ నాయకత్వంలో ఆడాలని సుదీర్ఘకాలంగా తాను కలగన్నానని యువ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అంటున్నాడు. విరాట్‌ను తాను ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు హార్దిక్‌ను అడిగి విరాట్‌ గురించి తెలుసుకొనేవాడినని వెల్లడించాడు.

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసుకు ఎంపికైన సూర్యకుమార్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జట్టుతో కలిసి ఉంటున్నాడు. జట్టు వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తున్నాడు. కొన్నేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, దేశవాళీ క్రికెట్లో అతడు నిలకడగా పరుగుల వరద పారించాడు. ఇప్పటికి అతడికి జట్టులో చోటు దొరకడం గమనార్హం.

‘ముందు నేను జట్టుతో నాణ్యమైన సమయం గడిపేందుకు ఎదురుచూస్తున్నా. అహ్మదాబాద్‌ చేరుకోగానే జట్టు వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించా. విరాట్‌ సారథ్యంలో ఆడాలని సుదీర్ఘ కాలంగా నేను కలగంటున్నా. అతడితో కలిసి ఆడేందుకు, వేగంగా నేర్చుకొనేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. అలా చేస్తే నేను మరింత మెరుగైన ఆటగాడిగా మారగలను’ అని సూర్యకుమార్‌ అన్నాడు.

‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో నేను విరాట్‌తో తలపడ్డాను. భారత్‌కు మైదానంలో అతడు అందించే ఉత్సాహం, ప్రేరణ, శక్తి ఎంతో గొప్పవి. అతనెప్పుడూ ఉరకలెత్తే ఉత్సాహంతోనే కనిపిస్తాడు. గెలవాలనుకొనే అతడి వైఖరి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు హార్దిక్‌ ద్వారా విరాట్‌ గురించి తెలుసుకొనే వాడిని. మ్యాచులో అత్యుత్తమంగా ఆడేందుకు అతడే విధంగా సాధన చేస్తాడోనని ఆరాతీసేవాడిని. సాధన, బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఇంకేం చేస్తున్నా అతడు ఉత్సాహంగానే ఉంటాడని పాండ్య నాతో చెప్పాడు. మరింత మెరుగైన క్రికెటర్‌గా మారేందుకు ఇలాంటివన్నీ నేను కోహ్లీ నుంచి నేర్చుకోవాలి’ అని సూర్యకుమార్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని