Dhoni : భారీగా పరుగులిచ్చినా.. అతడు ఒక్క మాట కూడా అనేవాడు కాదు : చాహల్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ప్రశంసలు కురిపించాడు. భారత కెప్టెన్‌గా ధోని.. ఎల్లప్పుడూ తనకు మద్ధతుగా నిలిచాడని పేర్కొన్నాడు. భారీగా..

Published : 02 Feb 2022 15:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచాడని  లెగ్ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అన్నాడు. భారీగా పరుగులిచ్చినా.. ఒక్క మాట కూడా అనేవాడు కాదని చెప్పాడు.

‘దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టీ20 మ్యాచులో నేను 64 పరుగులు ఇచ్చాను. మహీ భాయ్‌ సూచనల మేరకు బౌలింగ్‌ చేసినా.. ప్రయోజనం లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో వేరే వ్యక్తి కెప్టెన్‌గా ఉంటే కచ్చితంగా తిట్టేవాడే. కానీ, ధోని భాయ్ అలా చేయలేదు. నా కాన్ఫిడెన్స్‌ దెబ్బ తినకుండా.. క్రికెట్లో అప్పుడప్పుడూ ఇలా జరుగుతుంటుంది. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసేందుకు నువ్వు మెరుగ్గానే ప్రయత్నించావు. కానీ, ఈ రోజు నీకు కలిసి రాలేదు. ఇంతకు ముందు వన్డే సిరీస్‌లో నువ్వు మెరుగ్గా బౌలింగ్‌ చేశావు. ఆడిన ప్రతి మ్యాచులో వికెట్లు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా గొప్పగా రాణించాలనుకుంటారు కదా!. దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. నీ వంతు 4 ఓవర్లు బౌలింగ్‌ పూర్తి చేసి చిల్‌ అవ్వు అని ధోని భాయ్‌ ధైర్యం చెప్పాడు’ అని యుజ్వేంద్ర చాహల్ పేర్కొన్నాడు.

‘ఆ ఘటన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. క్రికెట్లో పరిస్థితులు మన నియంత్రణలో ఉండవని అర్థమయ్యింది. కొన్ని మ్యాచుల్లో గొప్పగా రాణిస్తుంటాం. మరికొన్నింట్లో దారుణంగా విఫలమవుతుంటాం. మనకు అనుకూలించని రోజున ఎక్కువగా ఒత్తిడికి గురవకుండా.. వేరే వాళ్లకు అవకాశమివ్వాలి’ అని చాహల్‌ పేర్కొన్నాడు. ధోని సారథ్యంలోనే చాహల్ 2016లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని