Virat Kohli : విరాట్‌ మటన్‌ రోల్ కోసం వెళ్తే.. దుండగులు వెంబడించారు: ప్రదీప్‌ సంగ్వాన్‌

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ.. అండర్‌ - 19 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను కోహ్లీ మాజీ సహచర ఆటగాడు ప్రదీప్‌..

Published : 09 Mar 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ.. అండర్‌ - 19 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటనను కోహ్లీ మాజీ సహచర ఆటగాడు ప్రదీప్‌ సంగ్వాన్ తాజాగా బయటపెట్టాడు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘జూనియర్ క్రికెట్లో మేమిద్దరం ఏడేనిమిదేళ్లు ఒకే రూమ్‌ను పంచుకున్నాం. ఆ సమయంలో అండర్‌ - 19 ప్రపంచకప్‌ కోసం మేం దక్షిణాఫ్రికా వెళ్లినప్పుడు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విరాట్‌కి ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి స్ట్రీట్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. కోర్మా రోల్స్, చికెన్ రోల్స్ లాంటివి బాగా తినేవాడు. మేం బస చేస్తున్న హోటల్‌కి కొద్ది దూరంలో రుచికరమైన మటన్‌ రోల్‌ దొరుకుతుందని తెలిసింది. మా కార్‌ డ్రైవర్‌ కూడా అక్కడ భోజనం చాలా బాగుంటుందని చెప్పాడు. కానీ, ఈ మధ్యే అక్కడ గొడవ జరిగి ఓ వ్యక్తి చేయి నరికాడని అన్నాడు. దాంతో నేను చాలా భయపడిపోయాను. విరాట్‌ మాత్రం ‘ఏం కాదు.. వెళ్దాం పదా’ అని నన్ను అక్కడికి తీసుకెళ్లాడు. మేం భోజనం చేసి బయలు దేరే సమయంలో కొంతమంది దుండగులు మమ్మల్ని వెంబడించారు. దీంతో వెంటనే కార్‌ స్టార్ట్‌ చేసి.. మేం బస చేస్తున్న హోటల్ చేరే వరకు ఎక్కడా ఆగకుండా వచ్చేశాం’ అని ప్రదీప్‌ సంగ్వాన్‌ పేర్కొన్నాడు.

* టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాక చాలా బరువు తగ్గాడు..

‘విరాట్‌ టీమిండియాకు ఎంపికయ్యాక డైట్‌ విషయంలో చాలా కచ్చితంగా ఉండేవాడు. తన బరువును తగ్గించుకునేందుకు.. కఠినమైన డైట్‌ను పాటించేవాడు. మటన్‌ రైస్‌కు బదులుగా ఉడకబెట్టిన మొలకలు, గుడ్లు, సలాడ్లు, డ్రై ఫ్రూట్స్‌ లాంటివి తినేవాడు. అది కూడా రోజుకి ఇంతని తూకం వేసుకుని మరీ తినేవాడు. దీంతో మూడు నెలల్లోనే.. దాదాపు 12 కిలోల బరువు తగ్గాడు. శరీరం ఫ్లెక్సిబుల్‌గా ఉంటేనే.. మైదానంలో చురుగ్గా కదలగలమని చెప్పేవాడు. అలా తన ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు’ అని ప్రదీప్‌ సంగ్వాన్‌ అన్నాడు.

2008లో అండర్‌ - 19 ప్రపంచకప్‌ జట్టుకు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, సిద్ధార్థ్ కౌల్, సౌరభ్ తివారీ, ప్రదీప్ సంగ్వాన్‌ తదితరులు అండర్ -19 జట్టులో కోహ్లీ సహచర ఆటగాళ్లన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని