Sangakkara: కుంబ్లే వల్ల నిద్రలేని రాత్రులు..!

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా...

Updated : 21 May 2021 16:33 IST

గుర్తు చేసుకున్న కుమార సంగక్కర

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌కు ఎంపికైన నేపథ్యంలో అతడిపై ఓ వీడియోను రూపొందించింది. శ్రీలంక ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్దనె, పాక్‌ పేసర్‌ వసీమ్‌ అక్రమ్‌ తదితరులు జంబోతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.

‘కుంబ్లే వల్ల ఒక బ్యాట్స్‌మన్‌గా నిద్రలేని రాత్రులు గడిపాను. అతడు అందరి లాంటి సంప్రదాయ లెగ్‌ స్పిన్నర్‌ కాదు. పొడవుగా, బలంగా ఉంటాడు. పరుగెత్తుకుంటూ వచ్చి చాలా ఎత్తు నుంచి బంతి వదులుతాడు. వేగంగా, నేరుగా, కచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు. అతడి బౌలింగ్‌లో పరుగులు చేయడం తేలిక కాదు. బౌలింగ్‌లో వేగం ఉండటంతో బంతి బాగా బౌన్స్‌ అవుతుంది. పిచ్‌పై పగుళ్లు ఉంటే అతడు విసరే లెంగ్తుల్లో ఆడటం కష్టం. కుంబ్లే చాలామంచి వ్యక్తి. అంకితభావంతో ఆడతాడు.  ప్రపంచ క్రికెట్లో అతనో విజేత’ అని సంగక్కర అన్నాడు.

కుంబ్లే బలాలేంటో తనకు బాగా తెలుసని జయవర్దనె తెలిపాడు. తన బంతుల ద్వారా అతడు బ్యాట్స్‌మన్‌ను ప్రశ్నిస్తూనే ఉంటాడని చెప్పాడు. ప్రతి బ్యాట్స్‌మన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుందని పేర్కొన్నాడు. ‘దిల్లీలో మాపై అతడు 10 వికెట్లు తీయడం నాకింకా గుర్తుంది. ఆ పదో వికెట్‌ నేనే. అదేదో నిన్నే జరిగినట్టు నాకనిపిస్తోంది. చాలా భిన్నమైన లెగ్‌ స్పిన్నర్‌ అతడు’ అని వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని