ఫెయిల్యూర్‌ను చూసేశా..ఇక అరంగేట్రమే: కుల్‌దీప్

‘టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మ్యాచ్‌ విన్నర్‌’.. గతంలో మాజీలు, విశ్లేషకులు చెప్పిన మాటలు ఇవి. కానీ ఇప్పుడు అతడు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు....

Updated : 09 Jun 2022 14:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ మ్యాచ్‌ విన్నర్‌’.. గతంలో మాజీలు, విశ్లేషకులు చెప్పిన మాటలు ఇవి. కానీ ఇప్పుడు అతడు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టుల్లోనూ అవకాశాలు దక్కట్లేదు. 2019 జనవరిలో సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు ఆడాడు. అయితే అవకాశాలు రాకున్నా బౌలింగ్‌లో మెరుగవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తున్నానని కుల్‌దీప్‌ తెలిపాడు. జీవితంలో వైఫల్యాన్ని చూశానని, మరోసారి అరంగేట్రం చేస్తున్నానే భావన కలుగుతుందని పేర్కొన్నాడు.

‘‘దాదాపు రెండేళ్ల నుంచి టెస్టు మ్యాచ్ ఆడట్లేదు. ఇప్పుడు అవకాశం వస్తే అరంగేట్రంలానే ఉంటుంది. ఎప్పటిలాగే జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా. వంద శాతం సామర్థ్యంతో పోరాడాలనుకుంటున్నా. అయితే తొలి మ్యాచ్ అంటే కాస్త భయంగా ఉంటుంది. అంతేగాక అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, భారీ అంచనాలు ఉన్నాయని తెలిసినప్పుడు.. మంచి ప్రదర్శన చేయాలనే ఒత్తిడి మనపై ఉంటుంది’’ అని కుల్‌దీప్ అన్నాడు.

‘‘2020 ఐపీఎల్ సీజన్‌ కలిసిరాలేదు. ఆ సీజన్‌లో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సింది. ఎందుకంటే నేను మంచి లయలో ఉన్నాను. బాగానే బౌలింగ్‌ చేశాను కూడా. కానీ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. 2019 సీజన్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది. అయితే విఫలమయ్యే వరకు మనం ఒత్తిడిని జయించలేం. ఇప్పుడు ఆ విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్నాను. నా జీవితంలో ఫెయిల్యూర్‌ను చూసేశా. ఇక నేను మంచి ప్రదర్శన చేయకపోయినా అది కొత్త విషయమేమి కాదు. కానీ, కఠోర సాధన చేస్తే తప్పక విజయం సాధించగలం’’ అని కుల్‌దీప్‌ అన్నాడు. చెన్నై వేదికగా శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న తొలి టెస్టులో కుల్‌దీప్‌ తుదిజట్టులో ఉంటాడని భావిస్తున్నారంతా.

ఇవీ చదవండి

ద్రవిడ్‌పై సచిన్‌ అలిగిన వేళ..!

చెపాక్ గడ్డ.. త్రిశతకాల అడ్డా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని