Asia Cup Final: ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే..!

ఆసియా కప్‌ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్‌ను అందుకుంది.........

Published : 12 Sep 2022 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియా కప్‌ ఫైనల్‌ పోరులో పాకిస్థాన్‌ 23 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో శ్రీలంక జట్టు ఆరోసారి ఆసియా కప్‌ను అందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ కీలకమైన క్యాచ్‌ను పాక్‌ ఫీల్డర్లు ఢీకొని నేలపాలు చేయడం శ్రీలంకకు కలిసొచ్చింది. క్యాచ్‌ను జారవిడవడమే కాదు.. ఏకంగా ఆరు పరుగులు సమర్పించుకున్నారు కూడా. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన లంక జట్టులో రాజపక్స మినహా ఇక మిగిలింది బౌలర్లు మాత్రమే. అలాంటి కీలక సమయంలో రాజపక్స ఇచ్చిన ఆ క్యాచ్‌ను జారవిడవడంతో పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ క్యాచ్‌ను జారవిడిచినవారిలో ఒకరైన వైస్‌ కెప్టెన్‌ షాదాబ్‌ ఖాన్‌ స్పందించాడు. మ్యాచ్‌ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో షాదాబ్‌ రెండు క్యాచ్‌లను విడిచిపెట్టాడు.

మ్యాచ్‌ అనంతరం ట్వీట్‌ చేస్తూ.. ‘క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. ఈ ఓటమికి నేను బాధ్యత వహిస్తున్నా. నేను నా బృందాన్ని నిరాశపరిచాను’ అంటూ పేర్కొన్నాడు. జట్టు మొత్తం శాయశక్తులా ప్రయత్నించిందని.. నసీమ్‌ షా, హారిస్‌ రౌఫ్‌, నవాజ్‌ త్రయం అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ గొప్పగా పోరాడాడని ప్రశంసించాడు. కప్‌ సాధించిన శ్రీలంక జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

18.6వ ఓవర్‌లో మహమ్మద్‌ హస్నైన్‌ వేసిన బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లో ఉన్న ఈ బంతిని అందుకొనేందుకు అక్కడే ఉన్న అసిఫ్‌ అలీ ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో షాదాబ్‌ ఖాన్‌ గుడ్డిగా ఆ దిశగా పరిగెత్తుకొంటూ వచ్చి అలీను ఢీకొన్నాడు. అప్పటికే అలీ చేతికందిన బంతి.. షాదాబ్‌ ఢీకొనడంతో బౌండరీ లైన్‌ బయటపడింది. ఫలితంగా వికెట్‌ కోల్పోవాల్సిన శ్రీలంకకు సిక్సర్‌ లభించింది. అప్పటికే జోరుమీదున్న రాజపక్స చివరి ఓవర్లో 14 పరుగులు సాధించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని