WTC final: ఫేవరెట్‌ ఎవరో చెప్పడం కష్టం.. భారత బౌలింగ్‌ అటాక్‌లో ప్రధాన అస్త్రం అతడే: డివిలియర్స్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్లో ఏ జట్టు ఫేవరెట్ ఎంచుకోవడం చాలా కష్టమని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ పేర్కొన్నాడు. 

Published : 06 Jun 2023 20:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్‌ 7 (బుధవారం) నుంచి ప్రారంభంకానున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో భారత్‌, ఆసీస్‌ తలపడనున్నాయి. లండన్‌లోని ఓవల్‌ మైదానం ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మహాసంగ్రామంలో ఏ జట్టు విజయం సాధిస్తుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) మాట్లాడాడు. భారత్‌, ఆస్ట్రేలియాలో ఏది ఫేవరెట్ జట్టో ఎంచుకోవడం చాలా కష్టమని పేర్కొంటూనే.. టీమ్‌ఇండియా (Team India) విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.  

‘‘ఏ జట్టులో ఫేవరెటో చెప్పడం చాలా కష్టం. రెండు జట్లు (భారత్, ఆసీస్)  ఇటీవల కాలంలో ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కానీ, డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగే ఓవల్‌ మైదానంలో భారత్‌ తమ చివరి మ్యాచ్‌లో అత్యంత పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఓడించింది. టీమ్‌ఇండియాకున్న అడ్వాంటేజ్ అదే. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ ఐదో రోజు పట్టు సాధిస్తుందని భావిస్తున్నా. ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కానీ, మ్యాచ్‌ చివరి దశలో భారత స్పిన్నర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు. 

డివిలియర్స్ కోహ్లీ ఆటతీరు గురించి కూడా మాట్లాడాడు. ‘‘విరాట్ ఎక్కడ ఆడినా తానెంటో నిరూపించుకోవాలనుకుంటాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై అతడు నిలకడగా రాణించాడు. అతడు ఫామ్‌లోకి వచ్చి ఆటను ఆస్వాదించడం చూడటానికి ఎంతో బాగుంది. కోహ్లీ ఇంగ్లాండ్‌లో మళ్లీ బాగా ఆడాలని కోరుకుంటున్నా. బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం టీమ్‌ఇండియాకు పెద్ద లోటు. కానీ, మహ్మద్‌ సిరాజ్‌ ఆ లోటును భర్తీ చేస్తాడనుకుంటున్నా. అతను ఇంతకు ముందు అక్కడ బాగా రాణించాడు. అతనికి అదనపు పేస్ లభించింది. భారత బౌలింగ్‌ అటాక్‌లో ప్రధాన అస్త్రం సిరాజ్‌ అని అని భావిస్తున్నా’’ అని ఏబీ డివిలియర్స్‌ ముగించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని