Pant: పంత్‌ కారు ప్రమాదం.. ‘అప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాటల్లో చెప్పలేను’

రిషభ్‌ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదం గురించి టీమ్‌ఇండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మాట్లాడాడు. ప్రమాదం విషయం తెలిసిన చాలా ఆందోళనకు గురయ్యానని చెప్పాడు.  

Updated : 04 Jan 2023 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ముంబయికి తరలించారు.  పంత్ ప్రమాదానికి గురైన వార్త విని క్రికెటర్లతో టీమ్‌ఇండియా అభిమానులు షాక్‌కు గురయ్యారు. టీమ్ఇండియా యువ బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కూడా పంత్‌ ప్రమాద విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యాడట. ఈ ప్రమాదం జరిగినప్పుడు కిషన్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. విరామ సమయంలో అతడి ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీల కోసం వచ్చిన అభిమానులు పంత్‌ ప్రమాదం గురించి ఇషాన్‌కు తెలియజేశారు. తాజాగా మంగళవారం శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌కు ముందు రిషభ్‌ పంత్‌ రోడ్డు ప్రమాదం గురించి ఇషాన్‌ కిషన్‌ మాట్లాడాడు. 

‘మొదట్లో నాకు ఈ విషయం గురించి కచ్చితమైన సమాచారం లేదు. ఇది సాధారణ ప్రమాదం అని  అనుకున్నాను.  కానీ, తర్వాత పంత్‌ చాలా సీరియస్‌గా ఉన్నాడని నాకు తెలియడంతో చాలా ఆందోళన చెందా. అనంతరం రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నంత సేపు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాటల్లో చెప్పలేను. అతడికి అంతా మంచే జరగాలని, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు అద్భుతమైన ఆటగాడు. రిషభ్‌ ఫైటర్ అని నాకు తెలుసు. జట్టు కోసం మైదానంలో ఎంతలా పోరాడాడో మనం చూశాం. పంత్‌ అతి త్వరలోనే తిరిగి వస్తాడు’ అని ఇషాన్‌ కిషన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని