Arjun Tendulkar: ‘సచిన్‌ కుమారుడిని అనే విషయాన్ని వచ్చే 15 రోజులు మర్చిపో’

సచిన్ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ రంజీ ట్రోఫీలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదాడు. దీంతో అతడికి పలువురు క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు, యువరాజ్‌ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌.. అర్జున్‌కి అభినందనలు తెలిపి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

Published : 15 Dec 2022 18:21 IST

ఇంటర్నెట్ డెస్క్: సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ తన తొలి రంజీ మ్యాచ్‌లో శతకం బాదాడు. గోవా తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న అర్జున్‌ రాజస్థాన్‌తో గ్రూపు సి మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. సచిన్‌ కూడా రంజీ ట్రోఫీలో తన అరంగేట్ర మ్యాచ్‌లో (1988లో) సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అర్జున్ తెందూల్కర్‌ నిరుడు ముంబయి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీంతో ముంబయి నుంచి నిరభ్యంతర పత్రం తీసుకుని ఈ ఏడాది గోవాకు తరలివెళ్లాడు. అరంగేట్ర మ్యాచ్‌లో తండ్రిలాగే తనయుడు కూడా శతకం  బాదడంతో అర్జున్‌ తెందూల్కర్‌కి పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు, యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ అర్జున్‌ తెందూల్కర్‌ని అభినందించాడు. అనంతరం యోగ్‌రాజ్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

గోవా జట్టుకు మారడానికి ముందు అర్జున్‌ తెందూల్కర్‌.. యూవీ తండ్రి యోగిరాజ్‌ వద్ద రెండు వారాలపాటు శిక్షణ తీసుకున్నాడు. సచిన్‌ విజ్ఞప్తి మేరకు యోగ్‌రాజ్‌ అతడికి శిక్షణ ఇచ్చాడు. అప్పటి విషయాలను యోగిరాజ్‌ తాజాగా పంచుకున్నారు.‘సెప్టెంబరు మొదటి వారంలో నాకు యువీ (యువరాజ్‌ సింగ్) ఫోన్‌ వచ్చింది. ‘డాడీ.. రెండువారాలపాటు అర్జున్‌ తెందూల్కర్‌ చంఢీగడ్‌లో ఉంటాడు. మీకు సమయం ఉంటే అతడికి శిక్షణ ఇవ్వమని సచిన్‌ కోరారు’యువీ అని చెప్పాడు. ‘ నేను సచిన్‌కి నో చెప్పను. అతను నా పెద్ద కొడుకు లాంటివాడు. కానీ, నాది ఒక షరతు. నా శిక్షణా విధానం నీకు తెలుసు. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదు’అని యువరాజ్‌ సింగ్‌కి చెప్పాను అని యోగ్‌రాజ్‌ పేర్కొన్నారు.  

శిక్షణ ఇవ్వడానికి ముందు అర్జున్‌తో మాట్లాడిన విషయాలను పంచుకుంటూ..‘కోచ్‌లు అతడిని గారాబం చేశారని ఫీలయ్యా. ఎందుకంటే అతడు సచిన్ కుమారుడు. నువ్వు నీ తండ్రి నీడ నుంచి బయటికి వచ్చేయ్‌.. రానున్న 15 రోజులు నువ్వు సచిన్‌ కొడుకును అనే విషయాన్ని మర్చిపో అని అతడికి చెప్పా ’ అని యోగ్‌రాజ్‌ తెలిపారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని