Shubman Gill: ఓపెనర్‌గా రావాలనుకుంటున్నా.. రోహిత్‌, కోహ్లీ స్థానంపై కన్నేసిన శుభ్‌మన్‌ గిల్‌

Shubman Gill: అంతర్జాతీయ టీ20ల్లో తాను ఓపెనర్‌గా ఉండాలనుకుంటున్నట్లు యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ చెప్పారు. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ తాను ఓపెనింగ్‌ చేస్తున్నట్లు తెలిపాడు.

Updated : 06 Jul 2024 11:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌ పోరులో వీరిద్దరూ ఓపెనింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు స్టార్లను రీప్లేస్ చేసే బ్యాటర్లు ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20లకు తాను ఓపెనర్‌గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు.

జింబాబ్వేతో (IND vs ZIM) టీ20 పోరుకు గిల్‌ నేతృత్వంలోని యువ టీమ్‌ఇండియా (Team India) సిద్ధమవుతోంది. ఈ సాయంత్రం మ్యాచ్‌ జరగనుంది. దీని ముందు కెప్టెన్‌ గిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌లో రోహిత్‌ (Rohit Sharma), విరాట్ భాయ్‌ ఓపెనింగ్‌ చేశారు. నేను కూడా టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా వచ్చా. అంతర్జాతీయ టీ20ల్లోనూ ఓపెనింగ్‌ బ్యాటర్‌ (T20I Opener)గా రావాలనుకుంటున్నా. జింబాబ్వేతో మ్యాచ్‌లో నాతో కలిసి అభిషేక్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ మూడో స్థానంలో ఆడతాడు’’ అని చెప్పాడు.

ఇక కుర్రాళ్ల సమయం.. యువ భారత్‌కు తొలి పరీక్ష

ఇక, రోహిత్‌, కోహ్లీ (Virat Kohli) స్థాయిని అందుకోవాలనుకోవడం కాస్త ఒత్తిడితో కూడుకున్నదే అని గిల్‌ అన్నాడు. ‘‘ప్రతి ఆటగాడికి వ్యక్తిగత లక్ష్యాలుంటాయి. వారిద్దరు లెజెండ్స్‌. వారు చేరుకున్న స్థాయికి నేను చేరుకోవాలంటే అది నాకు కాస్త కష్టమైన ప్రక్రియే. అప్పుడు నాపై ఒత్తిడి కూడా ఉంటుంది. దాన్ని అధిగమించి ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’’ అని వివరించాడు.

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. హరారె వేదికగా ఈ సాయంత్రం 4.30 గంటలకు తొలి మ్యాచ్‌ జరగనుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఈ సిరీస్‌కు యువ ఆటగాళ్లకు ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని