సూది మందు తీసుకొని ప్యాడ్లు కట్టుకున్నా: జడ్డూ

సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడేందుకు తాను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. ఇందుకోసం సూదిమందు సైతం తీసుకున్నానని పేర్కొన్నాడు. కనీసం 10-15 ఓవర్లు ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని వెల్లడించాడు. రిషభ్ పంత్‌, పుజారా....

Published : 23 Jan 2021 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆడేందుకు తాను ప్యాడ్లు కట్టుకొని సిద్ధమయ్యానని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అన్నాడు. ఇందుకోసం సూదిమందు సైతం తీసుకున్నానని పేర్కొన్నాడు. కనీసం 10-15 ఓవర్లు ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యానని వెల్లడించాడు. రిషభ్ పంత్‌, పుజారా ఆడుతున్నంత వరకు మ్యాచ్‌ గెలుస్తామనే అనిపించిందన్నాడు. వారిద్దరూ ఔటవ్వడంతో డ్రా చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపాడు. ఆ సమయంలో హనుమ విహారి, రవిచంద్రన్‌ అశ్విన్‌ గొప్పగా పోరాడారని ప్రశంసించాడు.

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ చేతి వేలికి బంతి తగిలింది. దాంతో వేలి లోపల ఎముక విరిగింది. టెయిలెండర్లతో కలిసి పరుగులు చేయాలన్న ఆత్రంలో అతడు నొప్పిని పట్టించుకోలేదు. అయితే బ్యాటింగ్‌ ముగిశాక జడ్డూ నొప్పితో విలవిల్లాడాడు. ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకోలేదు. బౌలింగ్‌ చేయలేదు. కీలకమైన ఛేదనలో అవసరమైతే బ్యాటింగ్‌ చేసేందుకు ప్యాడ్లు కట్టుకొని సిద్ధమవ్వడం గమనార్హం.

‘అవును, నేను సిద్ధమయ్యా. సూదిమందూ తీసుకున్నా. కనీసం 10-15 ఓవర్లైనా ఆడేందుకు మానసికంగా సన్నద్ధమయ్యా. ఇన్నింగ్స్‌ను ప్లాన్‌ చేసుకున్నా. ఎందుకంటే గాయపడ్డ చేతిలో అన్ని షాట్లు ఆడలేం కదా. ఫాస్ట్‌ బౌలర్ల బంతులను ఎలా ఆడాలి? వారు బంతిని ఎక్కడ పిచ్‌ చేస్తారు? వంటివన్నీ ఆలోచించా’ అని జడ్డూ తెలిపాడు.

‘మ్యాచ్‌ గెలిచే దశకు చేరుకున్నప్పుడే బ్యాటింగ్‌ చేస్తానని జట్టు యాజమాన్యానికి చెప్పాను. పుజారా, రిషభ్‌ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో మేం గెలుస్తామనే అనిపించింది. దురదృష్టవశాత్తు పంత్ ఔటవ్వడంతో పరిస్థితి మారింది. అక్కడ్నుంచి డ్రా కోసం ఆడాల్సి వచ్చింది’ అని జడ్డూ అన్నాడు.

‘మ్యాచు కాపాడుకొనేందుకు అశ్విన్‌, విహారి పోరాడిన తీరు అద్భుతం. టెస్టు క్రికెట్లో ప్రతిసారీ పరుగులు చేయడమే కాదు మ్యాచును కాపాడుకోవాల్సి పరిస్థితులూ వస్తాయి. నిజంగా అదొక గొప్ప బృంద పోరాటం’ అని జడ్డూ అన్నాడు. బ్యాటింగ్‌ జోరులో తన వేలు విరిగిందన్న విషయం గుర్తించలేదని అతడు తెలిపాడు. పరుగుల మీదే దృష్టి సారించానన్నాడు. స్కానింగుకు వెళ్లాకగానీ చేతివేలు విరిగిందన్న సంగతి తెలియలేదన్నాడు. అయినప్పటికీ జట్టు కోసం బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధమయ్యానని తెలిపాడు.

ఇవీ చదవండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రవిశాస్త్రి హెచ్చరిక..
రవిశాస్త్రి చెప్పమన్నా.. శార్దూల్‌ చెప్పలేదు.. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని