Shoaib Akhtar: అప్పుడు రాహుల్‌కు ఆగ్రహం వచ్చింది.. నాకు ఆశ్చర్యమేసింది: అక్తర్‌

ఎప్పుడైనా సరే భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉండేవి. అభిమానులు, ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యేవారు. అయితే  ఎల్లవేళలా...

Published : 19 Aug 2022 15:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎప్పుడైనా సరే భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉండేవి. అభిమానులు, ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యేవారు. అయితే  ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటూ తన పనేదో చేసుకుపోయే రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఆగ్రహానికి గురైన సంఘటన 2004 ఛాంపియన్స్‌ ట్రోఫీలో చోటు చేసుకుంది. ఆ సంఘటనను పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ జరిగిందే దాయాది దేశాల మధ్య.. అదీనూ ద్రవిడ్ కోపానికి గురైన ఆటగాడు అక్తర్ కావడం విశేషం. మ్యాచ్‌ సందర్భంగా ఒకరినొకరు తాకడంతో ద్రవిడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదెలా జరిగిందో షోయబ్ మాటల్లో.. 

‘‘భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌. ఈ సందర్భంగా ద్రవిడ్‌, నేనూ ఒకరికొకరం ఢీకొన్నాం. దీంతో ద్రవిడ్‌ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నావైపు వచ్చాడు. అయితే నేను అటువైపు వెళ్తా.. నువ్వు ఇటువైపు వెళ్లు అని చెప్పా. దీంతో రాహుల్‌ మరింత రెచ్చిపోయాడు. ఇలా రాహుల్‌ ద్రవిడ్‌ను ఆగ్రహంతో చూడటం అదే ఫస్ట్‌టైమ్‌. ‘రాహుల్‌ నువ్వు చాలా అగ్రెసివ్‌ ఉన్నావు’ అని అన్నా. మైదానంలోని పరిస్థితులు మారిపోతాయని నాకు తెలుసు. ఇక రాహుల్‌ కూడా వదిలేశాడు. అందుకే ద్రవిడ్‌ను క్రికెట్‌ జెంటిల్‌మన్‌ అనేది. ఇక ఆ స్పెల్‌లో చాలా బాగా బౌలింగ్‌ చేశా. మేం ఓడినా.. విజయానికి చేరువగా వచ్చాం. 2003 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియాపై చాలా బాగా ప్రభావం చూపా’’ అని అక్తర్ వివరించాడు. 

భారత్‌ను తొలిసారి ఎదుర్కొన్నప్పుడు.. 

షోయబ్‌ అక్తర్‌ పాక్‌ తరఫున 1997లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 1999లో తొలిసారి టీమ్‌ఇండియాపై ఆడాడు. అప్పటికే భారత్‌కు సచిన్‌, సౌరభ్‌ గంగూలీ, సెహ్వాగ్, ద్రవిడ్‌, లక్ష్మణ్‌ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ నాలుగేసి వికెట్లు తీసి పాక్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సచిన్‌, లక్ష్మణ్‌, ద్రవిడ్‌ను ఔట్ చేసి సంచలనం సృష్టించాడు. తొలిసారి భారత్‌తో ఆడేటప్పుడు తనకు కొన్ని సందేశాలు వచ్చాయని అక్తర్‌ వెల్లడించాడు. ఓ క్రీడా ఛానల్‌లో సెహ్వాగ్‌తో మాట్లాడుతూ.. ‘‘సలీమ్‌ మాలిక్‌ అనుకుంటా ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ గురించి చెబుతూ.. ఫాస్ట్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. అందుకే నువ్వు ఆడుతున్నావు అని చెప్పాడు. ఇక భారత్‌తో నా తొలి టెస్టులో నేను బ్యాటర్‌ తల, పక్కెటెముకలను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్‌ వేశా. దీంతో చాలామంది ‘బౌలింగ్‌తో చంపేస్తావా ఏంటి?’ అని టీమ్‌ఇండియా నుంచి సందేశాలు వచ్చేవి. ‘నేను ఔట్‌ చేయకూడదా..? అని వారితో అనేవాడిని. ‘నీ దగ్గర మంచి పేస్‌ ఉంది. అయితే దాంతో ప్రజలను చంపడానికి కాదు. ఔట్‌ చేయడమే మన కర్తవ్యం’ అని పలువురు ఆటగాళ్లు చెప్పేవారు. ఇదే విషయంపై సౌరభ్‌తో ‘నిన్ను ఔట్‌ చేయడం కాదు.. నీ పక్కటెముకలకు తగిలేలా బౌలింగ్‌ వేయాలనేది మా ప్లాన్‌’ అని అన్నాను. నా తొలి వన్డేలోనే సెహ్వాగ్‌ను ఔట్‌ చేయడం ఎప్పటికీ మరిపోలేను’’ అని వివరించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని