Adil Rashid: ఈసారి నేను భారత టీ20 లీగ్‌ వేలంలోకి వచ్చేస్తా: అదిల్ రషీద్‌

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తన స్పిన్ మాయాజాలంతో పాక్‌ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన అదిల్‌ రషీద్‌ త్వరలో భారత టీ20 లీగ్‌లోకి వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్‌లో జరిగే వేలంలో పాల్గొనే అవకాశం ఉందని, తన పేరును నమోదు చేసుకుంటానని రషీద్‌ వెల్లడించాడు.

Published : 15 Nov 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో పాక్‌పై అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లాండ్‌ విజయంలో అదిల్‌ రషీద్‌ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బాబర్ అజామ్, మహమ్మద్ హారిస్‌ వికెట్లను తీసి పాక్‌ను కట్టడి చేయడంలో భాగమయ్యాడు. ఈ క్రమంలో అదిల్‌ కీలక ప్రకటన చేశాడు. డిసెంబర్‌లో జరిగే భారత టీ20 లీగ్‌ వేలంలో తన పేరును నమోదు చేసుకొనేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. 2021లో పంజాబ్‌ జట్టు తరపున రాజస్థాన్‌ మీద కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. అందులోనూ మూడు ఓవర్లు వేసి వికెట్‌ తీయకుండా 33 పరుగులు ఇచ్చాడు. మెగా వేలంలో ఎవరూ అతడిని కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు.

‘‘ఈసారి వేలంలో నా పేరును ఉంచేందుకు తప్పకుండా ప్రయత్నిస్తా. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేయడం వల్లే ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నా. ఇక టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో మా జట్టు అద్భుతంగా ఆడింది. దీని కోసం గత ఏడెనిమిదేళ్లుగా పాజిటివ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనైనా బెదురు లేకుండా ఆడటంపై దృష్టిపెట్టాం. మా ఖాతాలో రెండు ప్రపంచకప్‌లు (వన్డే, టీ20) దక్కించుకోవడం గొప్పగా ఉంది. బాబర్‌ అజామ్‌ వికెట్‌ తీయడం వల్ల మ్యాచ్‌ మలుపు తిప్పుతుందని తెలుసు కానీ.. అది ఇంత ప్రభావం చూపిస్తుందని ఊహించలేదు. బాబర్‌కు గూగ్లీ సంధించా. షాదాబ్‌ ఖాన్, లివింగ్‌ లియాన్‌స్టోన్‌ బౌలింగ్‌ గురించి పెద్దగా ఆలోచించలేదు. అయితే ఫైనల్‌లో మాత్రం కాస్త నెమ్మదిగానే బంతులను సంధించా’’ అని రషీద్‌ వివరించాడు. ఈ సంవత్సరం రషీద్‌ 24 టీ20ల్లో 19 వికెట్లు తీశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని