Charlie Dean: మన్కడింగ్‌ ఎఫెక్ట్‌.. ఇక నుంచి క్రీజులోనే ఉంటా: చార్లీ డీన్‌

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది.

Published : 27 Sep 2022 12:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రనౌట్‌పై డీన్‌ ఎట్టకేలకు స్పందించింది. ఆ ఘటనను ఉద్దేశిస్తూ ఇక నుంచి క్రీజులోనే ఉంటానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. లార్డ్స్‌ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన చార్లీ డీన్‌.. ‘‘వేసవికి ఆసక్తికర ముగింపు. ఇంగ్లాండ్‌ జెర్సీలో లార్డ్స్‌లో ఆడటం ఎనలేని గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి నేను నా క్రీజులోనే ఉంటానని అనుకుంటున్నా’’ అని పోస్ట్‌ చేసింది.

ఈ మ్యాచ్‌లో డీన్‌ అనేక సార్లు బంతిని వేయడానికి ముందే క్రీజును వదిలి వెళ్లడం దీప్తి గమనించింది. ప్రతి పరుగూ చాలా కీలకంగా మారిన స్థితిలో డీన్‌ను రనౌట్‌ చేసింది. దీంతో మన్కడింగ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆటల్లో నిబంధనలు, క్రీడా స్ఫూర్తిపై చర్చ మొదలైంది. దీప్తి శర్మ తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఇంగ్లాండ్‌ మద్దతుదారులు విమర్శించారు. అయితే ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని కొందరు మాజీలు భారత్‌కు మద్దతుగా నిలిచారు.

ఈ వ్యవహారంపై దీప్తి శర్మ కూడా స్పందించింది. ‘డీన్‌ పదే పదే ముందుకెళ్లడంపై ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోకపోవడంతో అలా చేయాల్సి వచ్చింది’’ అని తెలిపింది. దీనిపై అంపైర్లకు కూడా చెప్పామని పేర్కొంది. అయితే దీప్తి వ్యాఖ్యలను ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ ఖండించింది. మన్కడింగ్‌కు ముందు ఆ జట్టు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని, భారత్‌ తన చర్యను సమర్థించుకోడానికి అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని