ఆ క్షణాల్ని సిరాజ్‌ తండ్రి చూడాల్సింది: అక్తర్‌

తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేసిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్ కొనియాడాడు. ‘‘సిరాజ్‌కు..

Published : 02 Jan 2021 00:52 IST

ఇంటర్నెట్‌డెస్క్: తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేసిన హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్ కొనియాడాడు. ‘‘సిరాజ్‌కు నా ప్రగాఢ సానుభూతి. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలిచారని భావిస్తున్నా. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. భారత్ తరఫున సిరాజ్‌ ఆడుతున్న క్షణాలను అతడి తండ్రి చూడాలని ఎంతో ఆశించాడు. కానీ అది జరగలేదు. అయితే సిరాజ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అలాంటి మధుర క్షణాలను అతడి తండ్రి చూడాల్సింది’’ అని అన్నాడు.

‘‘బాక్సింగ్‌ డే టెస్టులో సిరాజ్‌ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు. అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు’’ అని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేసి సిరాజ్‌ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో మరణించారు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్‌ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు హాజరుకాలేదు. భారత్‌ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు.

కాగా, ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి కారణం భారత బౌలర్ల కృషేనని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించాలనే కోడ్‌ను టీమిండియా బౌలర్లు ఛేదించారని అన్నాడు. టెస్టు సిరీస్‌ విజయ మార్గంలో భారత్‌ పయనిస్తుందని పేర్కొన్నాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై మాట్లాడుతూ.. గులాబి బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే టీమిండియా ఓటమికి కారణమని అక్తర్‌ అన్నాడు.

ఇదీ చదవండి

కోహ్లీసేన.. 2021లో మారాలిక!

మానసిక ఇబ్బందుల్లో స్మిత్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని