Virat Kohli: కోహ్లీ గెలిచి.. వారికి ఊరట కలిగించాలి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవడానికి టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు...

Updated : 15 Jun 2021 18:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవడానికి టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ చాలా ఆసక్తిగా ఉన్నాడని, ఒకవేళ అదే నిజమైతే అతడికది గొప్ప విశేషమని వెస్టిండీస్‌ దిగ్గజ బౌలర్‌ ఇయాన్‌ బిషప్‌ అన్నాడు. విరాట్‌ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, ఒక మంచి కెప్టెన్‌కు ఉండాల్సిన లక్షణమని చెప్పాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కెప్టెన్‌పై తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

‘ఈ ఛాంపియన్‌షిప్‌ గెలవడం కోహ్లీకి అతిగొప్ప విశేషం. అతడు ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మంచి కెప్టెన్లకు ఉండాల్సిన లక్షణాల్లో అది ఒకటి. కేన్‌ విలియమ్సన్‌తో పాటు టాప్‌ లెవెల్లో అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లీలా బాగా ఆడేవాళ్లు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అయితే, అతడింకా చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కచ్చితంగా ట్రోఫీ గెలుపొందాలని అనుకుంటాడు. ఎందుకంటే దానికోసం అతడు చాలా కష్టపడ్డాడు. ఫాస్ట్‌ బౌలర్లపై నమ్మకం ఉంచి, జట్టులో మార్పులు చేసి సానుకూల దృక్పథం తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. జట్టు కోసం, దేశం కోసం అతడి కెప్టెన్సీలో ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ ఉండాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం లేదు’ అని బిషప్‌ చెప్పుకొచ్చాడు.

మరోవైపు కరోనా రెండో దశలో భారత్‌లో ఎంత తీవ్రంగా నష్టపోయిందో తెలిసిందే. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, మరెంతో మంది జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ఆటగాళ్లు దేశం తరఫున టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజయం సాధించి, ఆ ట్రోఫీతో బాధితులకు ఊరట కలిగించాలని బిషప్‌ కోరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు