Cricket News: అశ్విన్‌ విషయంలో అంచనా తప్పు

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకడని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించలేమని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నప్పుడు...

Updated : 06 Jun 2021 10:23 IST

దిల్లీ: ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడుతున్న అత్యుత్తమ బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకడని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించలేమని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నప్పుడు.. జోయల్‌ గార్నర్‌ గురించి ప్రస్తావించాడు ఛాపెల్‌. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కార్యక్రమంలో మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ‘‘అశ్విన్‌ను ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్లలో ఒకడిగా నేను పరిగణించలేను. ఎందుకంటే దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అతడు ఒక్కసారి కూడా అయిదు వికెట్ల ఘనత సాధించలేదు. సొంతగడ్డపై తనకు అనుకూలమైన పిచ్‌లపై మాత్రం చెలరేగిపోతాడు. ఇక్కడ కూడా గత నాలుగేళ్లుగా వికెట్ల వేటలో జడేజా అతడితో పోటీపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో స్పిన్‌ పిచ్‌లపై అక్షర్‌ పటేల్‌ అతడికన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. అశ్విన్‌ను నిజమైన ఆల్‌టైమ్‌ గ్రేట్‌గా పరిగణించడంలో ఇవే నాకున్న ఇబ్బందులు’’ అని అన్నాడు. అయితే మంజ్రేకర్‌ అభిప్రాయంతో ఛాపెల్‌ ఏకీభవించలేదు. ‘‘జోయల్‌ గార్నర్‌ ఎన్నిసార్లు అయిదు వికెట్ల ఘనత సాధించాడు? మంచి రికార్డున్నా.. ఎక్కువసార్లేమీ అతడు అయిదు వికెట్లు చేజిక్కించుకోలేదు. ఎందుకంటే అతడు మరో ముగ్గురు అత్యుత్తమ బౌలర్లతో కలిసి బౌలింగ్‌ చేశాడు’’ అని అన్నాడు. ‘‘కొన్నేళ్లుగా భారత బౌలింగ్‌ బలంగా ఉంది. బౌలర్లు ఎక్కువసార్లు వికెట్లు పంచుకుంటున్నారు. అశ్విన్‌ ప్రధాన బౌలర్‌ అని తెలియడం వల్ల ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ అతడిపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటారు. అక్షర్‌ గురించి వాళ్లకెలాంటి అవగాహనా లేదు’’ అని ఛాపెల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని