T20 World Cup: ఐసీసీతో జట్టుకట్టిన యూనిసెఫ్‌.. ఎందుకో తెలుసా?

ఆదివారం ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో యూనిసెఫ్ భాగంకానుంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం......

Updated : 16 Oct 2021 04:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సిద్ధమైంది. ఇందుకోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఆదివారం ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో యూనిసెఫ్ భాగంకానుంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, కౌమార దశలోని వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ)తో యూనిసెఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. యావత్ ప్రపంచం టీ20 వరల్డ్‌కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. చిన్నారుల ఆరోగ్యం కోసం యూనిసెఫ్ చేస్తున్న ఈ ప్రచారం ప్రపంచం నలుమూలలకు విస్తరించనుంది. ‘OnYourMind’ హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో జరిగే ఈ ప్రచారం ప్రజల మానసిక ఆరోగ్యం కోసం తాము ఏమేర నిబద్ధతను కలిగి ఉన్నామో తెలియజేస్తుందని ఐసీసీ ప్రకటించింది. ప్రతి చిన్నారి మానసిక ఆరోగ్యం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.

‘పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై అవగాహన పెంచేందుకు ఐసీసీ, యూనిసెఫ్‌ కట్టుబడి ఉన్నాయి. ఆదివారం నుంచి మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్ వేదికగా ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తాం’ అంటూ ఐసీసీ, యూనిసెఫ్‌ ఉమ్మడి ప్రకటన ద్వారా వెల్లడించాయి. ‘పిల్లల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుపై మరింత చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించి, జీవితంలోని సాధారణ ఒత్తిడిని తట్టుకోగలగాలి. ఒత్తిడిని అధిగమిస్తూ లక్ష్యాన్ని సాధించేలా ప్రేరణ నింపేందుకు కృషి చేస్తాం’ అని ప్రకటన ద్వారా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని