ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ విడుదల.. భారత్‌-పాక్ మ్యాచ్‌ ఎప్పుడంటే?

పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) జరగనుంది. ఈ మెగా టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ కూడా విడుదలైంది.

Published : 08 Jul 2024 15:16 IST

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ (Champions Trophy 2025) జరగనుంది. ఎనిమిది దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. ఇప్పటికే డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను ఐసీసీకి పాక్‌ క్రికెట్ బోర్డు అందజేసింది. అయితే, ఈ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌కు బీసీసీఐ నుంచి ఇంకా సమ్మతి రాలేదు. భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు బీసీసీఐ తదుపరి చర్యలు తీసుకోనుంది. ఇదిలాఉండగా.. ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రతిపాదిత షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈమేరకు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ నివేదికలను బట్టి చూస్తే మొత్తం 15 మ్యాచ్‌ల్లో    ఏడు లాహోర్‌లో, మూడు కరాచీలో, ఐదు రావల్పిండిలో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు.  మార్చి 1న లాహోర్‌ వేదికగా భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది.

సెమీ ఫైనల్స్‌కు కరాచీ, రావల్పిండి.. ఫైనల్‌ మ్యాచ్‌కు లాహోర్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్.. గ్రూప్‌ ‘బి’లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. భద్రతాపరమైన, రవాణా కారణాల దృష్ట్యా భారత్‌ మ్యాచ్‌లన్నింటినీ లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి పరిమితం చేశారు. భారత్‌ సెమీ ఫైనల్‌కు క్వాలిఫై అయితే ఆ మ్యాచ్‌ కూడా అక్కడే నిర్వహిస్తారు. ఆటగాళ్ల భద్రత, ఇతర కారణాల వల్ల టీమ్‌ఇండియా చాలాకాలంగా పాక్‌ పర్యటనకు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్‌ కోసం అక్కడికి వెళ్లింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే టీమ్ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం పాక్‌కు వెళ్తుంది. 

స్టేడియాల ఆధునికీకరణకు నిధులు 

ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న కరాచీ, లాహోర్‌, రావల్పండిలోని స్టేడియాలను ఆధునికరించేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు 17 బిలియన్లు కేటాయించింది.  లాహోర్‌లో జరిగిన సమావేశంలో పీసీబీ గవర్నర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ నెలఖారున కొలంబోలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లోనే నిర్వహించాలనే విషయంపై చర్చిస్తామని పీసీబీ ఛైర్మన్‌ మొహసీన్‌ నక్వీ తెలిపారు. వేదికలను ఏ క్లాస్‌ స్టేడియాలుగా మార్చేందుకు పనులు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రతిపాదిత షెడ్యూల్ ఇదే

 • ఫిబ్రవరి 19: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ - కరాచీ
 • ఫిబ్రవరి 20: బంగ్లాదేశ్ vs భారత్ - లాహోర్
 • ఫిబ్రవరి 21: అఫ్గానిస్థాన్‌ vs దక్షిణాఫ్రికా - కరాచీ
 • ఫిబ్రవరి 22: ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ - లాహోర్
 • ఫిబ్రవరి 23: న్యూజిలాండ్ vs భారత్ - లాహోర్
 • ఫిబ్రవరి 24: పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ - రావల్పిండి
 • ఫిబ్రవరి 25: అఫ్గానిస్థాన్‌ vs ఇంగ్లాండ్ - లాహోర్
 • ఫిబ్రవరి 26: ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - రావల్పిండి
 • ఫిబ్రవరి 27: బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ - లాహోర్
 • ఫిబ్రవరి 28: అఫ్గానిస్థాన్‌ vs ఆస్ట్రేలియా - రావల్పిండి
 • మార్చి 1: పాకిస్థాన్ vs భారత్ - లాహోర్
 • మార్చి 2: దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్ - రావల్పిండి
 • మార్చి 5: సెమీ-ఫైనల్ - కరాచీ
 • మార్చి 6: సెమీ-ఫైనల్ - రావల్పిండి
 • మార్చి 9: ఫైనల్‌ - లాహోర్
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని