WTC Final: ఛాంపియన్‌షిప్‌ విజేతకు భారీ నజరానా

ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజేతగా నిలిచే జట్టుకు ఐసీసీ సోమవారం భారీ నగదు నజరాన ప్రకటించింది. 1.6 మిలియన్‌ అమెరికా డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది...

Published : 15 Jun 2021 01:08 IST

అన్ని జట్లకు నగదు బహుమతి ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో విజేతగా నిలిచే జట్టుకు ఐసీసీ సోమవారం భారీ నగదు నజరానా ప్రకటించింది. 1.6 మిలియన్‌ అమెరికా డాలర్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. సౌథాంప్టన్‌లోని ఏజియస్‌ మైదానంలో ఈ శుక్రవారం నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఐదు రోజుల పాటు ఆ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అందులో గెలుపొందిన జట్టుకు భారీ నగదు బహుమతితో పాటు ‘ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గద’ను కూడా బహుకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు ఫైనల్లో ఓటమిపాలైన జట్టుకు 800,000 డాలర్లను, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 450,000 డాలర్లను, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 350,000 డాలర్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ఐదో స్థానంలో నిలిచిన జట్టుకు 200,000 డాలర్లతో పాటు మిగిలిన నాలుగు జట్లకు చెరో 100,000 డాలర్ల చొప్పున ఐసీసీ నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొంది. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ప్రారంభమైన ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీలు సుమారు రెండేళ్ల పాటు జరిగాయి. ఇందులో మొత్తం తొమ్మిది జట్లు తలపడగా భారత్‌, న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలవగా దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఒకవేళ ఈ ఫైనల్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసినా లేక టైగా మారినా తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదనుగుణంగా నగదును పంచుకుంటాయని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే ఆ రెండు జట్లు ఛాంపియన్‌గా ఉన్నన్ని రోజులు ఐసీసీ టెస్టు గదను కూడా సమానంగా తమ వద్ద ఉంచుకుంటాయని వివరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు