Cricket News: టీ20ల్లో స్లో బౌలింగ్‌ చేస్తే.. ఫీల్డింగ్‌ జట్టుకు భారీ శిక్ష

టీ20 క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగ్‌ చేస్తే ఇకపై ఫీల్డింగ్‌ చేసే జట్టుకు లైవ్‌ మ్యాచ్‌లోనే భారీ శిక్ష పడనుంది. అందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి శుక్రవారం కొత్త నిబంధనను తీసుకొచ్చింది...

Published : 07 Jan 2022 15:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌ బౌలింగ్‌ చేస్తే ఇకపై ఫీల్డింగ్‌ చేసే జట్టుకు లైవ్‌ మ్యాచ్‌లోనే భారీ శిక్ష పడనుంది. అందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి శుక్రవారం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై టీ20 క్రికెట్‌లో ఫీల్డింగ్‌ చేసే జట్టు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతిని నిర్దేశిత సమయానికే బౌలింగ్‌ చేయాల్సి ఉంది. అలా వేయకపోతే ఆ తర్వాత ఎన్ని ఓవర్లు (లేదా బంతులు) మిగిలినా.. 30 అడుగుల వృత్తం వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది. అది బ్యాటింగ్‌ చేసే జట్టుకు అనుకూలంగా మారగా.. ఫీల్డింగ్‌ చేసే జట్టుకు నష్టం కలిగించనుంది. ఆ సమయంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ పవర్‌ప్లే మాదిరే మరింత దంచికొట్టే అవకాశం కలగనుంది.

ఈ కొత్త నిబంధన ఈనెల 16 నుంచి అమలుకానుంది. వెస్టిండీస్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్‌తో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఐసీసీ తెలిపింది. ఇటీవల ఇంగ్లాండ్‌లో నిర్వహించిన ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా చేపట్టారు. అనంతరం ఐసీసీ అధికారులు తుది నిర్ణయం తీసుకొని ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశపెట్టారు. పొట్టి ఫార్మాట్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నియంత్రించేందుకు ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ ఇకపై టీ20 క్రికెట్‌లో డ్రింక్స్‌ విరామ సమయాల్లో ఐసీసీ కొత్త సడలింపు ఇచ్చింది. టోర్నీ ప్రారంభానికి ముందే ఇరు జట్ల అంగీకారం మేరకే ఇన్నింగ్స్‌ మధ్యలో ఆప్షనల్‌ డ్రింక్స్‌ బ్రేక్‌గా రెండున్నర నిమిషాలు విరామం తీసుకునే వీలు కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని