ICC ODI Rankings: ఏకంగా 20 స్థానాలు ఎగబాకిన గిల్‌.. నంబర్‌వన్‌ బౌలర్‌గా సిరాజ్‌

ఐసీసీ (ICC) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) నంబర్‌ వన్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌ గిల్ (Shubma Gill) కూడా తన స్థానాలను మరింత మెరుగుపర్చుకొన్నాడు.

Updated : 25 Jan 2023 15:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో సత్తా చాటిన టీమ్‌ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంకును అందుకున్నాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, హేజిల్‌వుడ్ లాంటి ఆటగాళ్లను వెనక్కినెట్టి అగ్రస్థానంలో నిలిచాడు.  729 రేటింగ్‌ పాయింట్లతో సిరాజ్‌ తొలి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌ వుడ్ 727 రేటింగ్‌ పాయింట్లతో  రెండో స్థానంలో, న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్ 708 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. 

బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-10లో టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లున్నారు. కివీస్‌పై తొలి వన్డేలో డబుల్‌ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ఏకంగా 20 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లోకి దూసుకొచ్చి ఆరో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా.. రోహిత్‌ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్‌ బ్యాటర్‌ బాబర్‌ అజామ్‌ నంబర్‌ వన్‌గా ఉన్నాడు. కివీస్‌ వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ఛాంపియప్‌ ఇంగ్లాండ్‌ని వెనక్కినెట్టి నంబర్‌ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. టీ20ల్లోనూ భారత్‌ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ని 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా నంబర్‌ వన్‌గా నిలుస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని