
ICC: ఐసీసీ టీ20 ర్యాంకులు.. ఆ జాబితాల్లో భారత్ నుంచి ఒక్కరూ లేరు
వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండు.. రోహిత్ మూడు
ఇంటర్నెట్ డెస్క్: టీ20 అత్యుత్తమ బౌలర్లు, ఆల్‌రౌండర్ల విభాగంలో టీమ్ఇండియా ఆటగాడు ఒక్కరు కూడా టాప్-10లో లేకపోవడం గమనార్హం. టాప్ బౌలర్ల జాబితాలో లంకకు చెందిన వహిందు హసరంగ (797), షంసి, అదిల్ రషీద్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్ వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో అఫ్గాన్ ఆటగాడు మహమ్మద్ నబీ తొలి ర్యాంక్ సాధించగా.. షకిబ్ అల్ హసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, వహిందు హసరంగ, మొయిన్ అలీ టాప్-5లో స్థానం సంపాదించారు. టీ20 బ్యాటింగ్ లిస్ట్‌లో కేఎల్ రాహుల్ (729) ఐదో స్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ (657) పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో రెండు అర్ధశతకాలు సాధించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ నాలుగో ర్యాంక్‌లో నిలిచాడు. ఇదే క్రమంలో ప్రొటీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆ జట్టు ఓపెనర్ డికాక్ ఐదో స్థానానికి ఎగబాకాడు. అలానే డస్సెన్ ఏకంగా పది స్థానాలను మెరుగుపరుచుకుని టాప్-10లోకి దూసుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ (873) తొలి స్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ (836), రాస్ టేలర్ (801), రోహిత్ శర్మ (801), డికాక్ (783), ఆరోన్ ఫించ్ (779), బెయిర్‌స్టో (775), డేవిడ్ వార్నర్ (754), కేన్ విలియమ్సన్ (754), డస్సెన్ (750) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ జాబితాలో బుమ్రా (689) ఒక్కడే ఏడోస్థానంతో టాప్-10లో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో రవీంద్ర జడేజా (231) తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నాడు.